మునుగోడు సభ కోసం టీఆర్ఎస్ ఇంచార్జిల నియామకం

మునుగోడు సభ కోసం టీఆర్ఎస్ ఇంచార్జిల నియామకం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఉప ఎన్నిక వస్తే ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు అవసరమైన కార్యాచరణను ఇప్పటి నుంచే  మొదలుపెట్టింది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభకు సన్నద్ధమైంది. ఈ నెల 20 న జరగనున్న సభను విజయవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రాంతాలవారీగా ఇంఛార్జిలను నియమించారు.

  • మునుగోడు : మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.
  • చౌటుప్పల్ మున్సిపాలిటీ : రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు.
  • చౌటుప్పల్ రూరల్ : హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
  • మర్రిగూడ : భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి.
  • నాంపల్లి : దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి.
  • చండూరు మున్సిపాలిటీ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య.
  • చండూరు రూరల్ : నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, యాదాద్రి జిల్లా జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి.
  • నారాయణపురం : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత.

ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు మునుగోడు కేంద్రంగా మారిపోయింది. ఊహించని ట్విస్టులు నెలకొంటున్నాయి. అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుత నియోజవర్గ ఇంచార్జి, మాజీ మంత్రి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అయిపోయిందని ప్రచారం జరిగింది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీల నేతలు అసమ్మతి గళం వినిపిస్తుండడంతో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. గ్రూప్ తగదాలకు చెక్ పెట్టేందుకు కొంతమంది నేతలు ప్రయత్నాలు జరుపుతున్నారు. బహిరంగసభలోనే అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తంగా ఓ వైపు జనసమీకరణలో బిజీగా ఉంటూనే.. అసమ్మతి నేతలతో చర్చలు జరుపుతున్నారు.