తెలంగాణకు 29న నడ్డా.. 30న మోదీ

తెలంగాణకు  29న నడ్డా.. 30న మోదీ
  •     నామినేషన్ల తర్వాత తొలిసారిగా తెలంగాణకు ప్రధాని 
  •     వచ్చే నెల 3,4 తేదీల్లోనూ మోదీ పర్యటనలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రచారాన్ని స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 29న రాష్ట్రానికి జేపీ నడ్డా రానుండగా, 30న మోదీ పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక తొలిసారిగా మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30న జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ అ భ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తర్వాత ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుల్తాన్‌‌పూర్‌‌లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న బీజేపీ విశాల జనసభలో మోదీ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అదేరోజు సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్‌‌, ఇంటలెక్చువల్స్‌‌తో సమావేశమయ్యే చాన్స్​ ఉంది. అలాగే, మే 3, 4 తేదీల్లోనూ మోదీ రాష్ట్రానికి రానున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ ఎంపీ సెగ్మెంట్లను కలుపుతూ మరో సభలో ఆయన పాల్గొంటారు. 4న మహబూబ్‌‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట‌‌లో, చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలోని వికారాబాద్‌‌లో సభలో మోదీ ప్రసంగించనున్నారు. గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనగా, కరీంనగర్‌‌‌‌లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్‌‌కు గుజరాత్ సీఎం భూపేందర్ పటేట్ , నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ నామినేషన్‌‌కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పాల్గొన్నారు. 

ఒకే రోజు మూడు చోట్ల ప్రచారం..

ఈ నెల 29న ఖమ్మం, మహబూబాబాద్, మల్కాజ్‌‌గిరి పార్లమెంట్ స్థానాల్లో జేపీ నడ్డా ప్రచారం చేస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఐటీసీ కాకతీయ హోటల్‌‌కు చేరుకున్నాక 11.15 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.15 గంటలకు కొత్తగూడెం చేరుకుంటారు. 12.30 నుంచి 1.30 గంటల వరకు పబ్లిక్ మీటింగ్‌‌లో పాల్గొంటారు. తర్వాత 2.20 గంటలకు హెలికాప్టర్‌‌‌‌లో బయలుదేరి 2.40 గంటలకు మహబూబాబాద్ చేరుకొని, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్‌‌లో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉప్పల్‌‌లో జరిగే రోడ్ షోలో నడ్డా పాల్గొంటారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.