- ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలో ప్రమాదం
అలంపూర్, వెలుగు : ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో 19 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని అనంతపూర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు 19 మంది ప్రయాణికులతో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి అనంతపూర్‌కు బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాదంలో బస్సులో ఉన్న సుబ్బరాయుడు, మోహన్‌రెడ్డి, రామేశ్వరమ్మ, స్నేహలత, అరుణ, రంగన్న, శివ, వీరేశ్, గౌస్‌కు తీవ్ర గాయాలు కాగా.. మిగతా 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని 108లో కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రయాణికుడు కనురెప్పల రంగన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.
