ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వాలు మారుతున్నా గీత కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంలేదని మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు అన్నారు. కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ పెంపు, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా హామీలను అమలు చేయలేదని విమర్శించారు. 850 మందికి రావాల్సిన రూ.14 కోట్ల ఎక్స్‌గ్రేషియా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, సంఘం నాయకులు ఎం.వి.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
