డబ్బుల కోసం, వ్యాపారం కోసం ధర్మాన్ని పాతరేస్తారా? 

డబ్బుల కోసం, వ్యాపారం కోసం ధర్మాన్ని పాతరేస్తారా? 
  • పాదయాత్రలో మాజీ మంత్రి ఈటల రాజేందర్

వరంగల్ అర్బన్: ‘‘డబ్బుల కోసం, వ్యాపారం కోసం ధర్మాన్ని పాతరేస్తారా? నేను కూడా అలా అనుకుని ఉంటే తరాలు తిన్నా తరగని సంపద సంపాదించేవాడ్ని.. వందల కోట్ల రూపాయల లాభం చేకూర్చే ఆఫర్ నాకు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు. కానీ నేను వెళ్లానా? ఈ ఆఫర్ అప్పటి మంత్రి రత్నాకర్ రావు తెచ్చాడు. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చి నా భూమి లాక్కునే ప్రయత్నం చేస్తే వై.ఎస్. తో కొట్లాడినోన్ని’’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆదివారం ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగింది. 
కమలాపూర్ మండలం కన్నూరులో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘‘నా కష్ట ఫలితం గుంజుకుంటావా అని కొట్లాడాను. నన్ను చంపేందుకు నయీం రెక్కీ నిర్వహించాడు. నాపార్టీలో ఉన్న సాంబశివుడు అనే వ్యక్తిని నయీం దారుణంగా చంపేస్తే.. నయీంను హెచ్చరిస్తూ కుక్క చావు చస్తావని స్టేట్ మెంట్ ఇచ్చాను.. నయీం ఊర్లో సభ పెడతానంటే బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు.. ఆ సభకు అందరూ బయపడితే నేనే వెళ్లాను.. పార్టీని, జెండాను బతికించిన వాళ్లలో నా శ్రమ లేదా? నా త్యాగం లేదా?  నా లాంటి వాన్ని వెళ్లగొట్టిన తీరు మీకు బాధకలిగించలేదా? రక్త సంబంధం కంటే వర్గం సంబంధం మిన్న? కానీ నన్ను వీడిన వాళ్లు అక్కడ ఏ సంబంధం ఉందని వెళ్లారు. నన్ను ప్రేమించే ఓ వ్యక్తి నా కాళ్లు మొక్కేందుకు వస్తే నేనే ఆపాను. ఒకవేళ నిజంగానే కాళ్లు మొక్కితే నన్ను కూడా దొర అని ప్రచారం చేసే ప్రమాదముందని వారించా. కన్నూరు ప్రజలారా..? నాయకులారా? మీకు ఇంతకాలం అండగా ఉంటే.. నన్ను విడిచి వాళ్ల పంచన చేరడం మంచిదేనా? కేసీఆర్ ఎలాంటి మోసం మోసపు మాటలు చెబుతున్నారో చూస్తున్నారు..’’ అని వివరించారు. 
ప్లేటు ఫిరాయించిన నలుగురు నాయకులపై ఈటల సెటైర్లు
మొన్నటిదాకా తనతో ఉండి.. ప్లేట్ ఫిరాయించి టీఆర్ఎస్ వైపు వెళ్లిన కన్నూరు గ్రామానికి చెందిన నలుగురు నాయకుల గురించి మాజీ మంత్రి ఈటల సెటైర్లు వేశారు. ఈ గ్రామంలోని సంపత్ రావు అనే నాయకుడు నాకు ఇంతకాలం అండగా ఉన్నందుకు బినామీ అని తప్పుడు ప్రచారం చేసారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వెళ్లిపోయాడు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు సంపత్ రావును ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పవాళ్లు. నేను ముఖ్యమంత్రి పదవి కోసం కుట్ర చేసానని కేసీఆర్ చెబుతున్నాడు కదా.. నిజంగా నేను కుట్ర చేసి ఉంటే సంపత్ రావు లాంటి వాళ్లకైనా తెలుస్తుంది కదా.. అని ఈటల ప్రశ్నించారు. మానుకోటలో రాళ్ల వర్షం కురయడానికి, రక్తం మడుగులు పారడానికి, తూటాలు పేలడానికి కారణమైన వ్యక్తి (కౌశిక్ రెడ్డిని పరోక్షంగా) పంచన సంపత్ రావు చేరాడని అన్నారు. తాను టీఆర్ఎస్ ఓ ఉన్నప్పుడు
ఒక్కనాడైనా  రెస్టులో ఉన్నానని గానీ, జ్వరం వచ్చి లీవ్ లో ఉన్నాడని గాని ఎప్పుడైనా చెప్పానా ? నిద్రపోయిన నాలుగైదు గంటల తప్ప...18 ఏళ్లుగా రోజుకు 16 గంటల పాటు ఒళ్లువంచి పనిచేసాను. నా క్యారెక్టర్ గురించి ఒక్క మరకైనా చూపించగలరా.. ప్రజలు గర్వించేలా బతికిన బిడ్డను నేను. ఇన్నేళ్ల తర్వాత నామీద భూకబ్జా చేసానని ఆరోపిస్తున్నాడని ఈటల పేర్కొన్నారు. 
అందరికంటే ఎక్కువగా నాగురించి తెలిసిన కేసీఆర్ ధర్మం తప్పి వ్యవహరించాడు
నాగురించి అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి కేసీఆర్...  కానీ ఆయనే ధర్మం తప్పి వ్యవహరించాడు. ఈ గ్రామ సర్పంచి రామారావు మొన్నటి వరకు నా వెంటే ఉన్నాడు. కావేరీ సీడ్స్ భాస్కర్ రావు పిలిచి సర్పంచికి రావాల్సిన విత్తన వడ్ల డబ్బులు 40-50 లక్షలు ఆపుతానని బెదిరించాడట. ఆయన కూడా అక్కడికే పోయాడు. నేను ముందే ఆనుకున్నా. 
ఈ గ్రామానికి చెందిన నలుగురు ముఖ్యమైన నాయకులు నాకు ఇంతకాలం అండగా ఉన్నోళ్లు నన్ను బాగా ప్రేమించిన వాళ్లు ఇప్పుడు శత్రువుతో చేతులు కలిపారంటూ ఈటల సెటైర్లు విసిరారు. నా మంత్రి పదవి నాకు గౌరవం ఇవ్వనప్పుడు, నా ప్రజలకు అక్కరకు రానప్పుడు అది గడ్డిపోచతో సమానం అని ఈటల స్పష్టం చేశారు. వీణవంకకు చెందిన ఓ నాయకుడు “కేసీఆర్ కు ఇంత దొరతనముంటదా? అని నాతో అంటే.. ఆయన ఆవేశం చూసి చల్లూరు సభలో నేను కూడా ఫించన్లు ఇవ్వాలని మాట్లాడాను, కానీ ఇప్పుడా నాయకుడు మళ్లీ అటే వెళ్లాడు,అంబేద్కర్ ఇచ్చిన ఓటును ధర్మం వైపు వేయాలని ఈటల రాజేందర్ కోరారు.