ముసారాంబాగ్ మునిగింది.. బ్రిడ్జి సెంట్రింగ్ కొట్టుకుపోయింది.. భయంకరంగా ప్రవహిస్తున్న మూసీ

ముసారాంబాగ్ మునిగింది.. బ్రిడ్జి సెంట్రింగ్ కొట్టుకుపోయింది.. భయంకరంగా ప్రవహిస్తున్న మూసీ

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ శివారు జంట జలాశయాలు నిండిపోయాయి. దీంతో శుక్రవారం (సెప్టెంబర్ 26) అధికారులు గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదిలారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతం అంతా ముంపుకు గురవుతోంది. 

పైనుంచి వస్తున్న వరద తాకిడికి మూసారాంబాగ్ బ్రిడ్జికి ఆనుకుని ఉన్న బస్తీల్లోకి వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి. కాలనీల్లోకి వచ్చిన నీరు.. ఇళ్లలోకి ప్రవేశించి బట్టలు, ఆహార పదార్థలు, వస్తువులు తడిసి పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోకాళ్ల నుంచి నడుము వరకు మురుగు నీరు కాలనీలను ముంచెత్తింది. 

వరద నీటి ప్రవాహానికి ముసారాంబాగ్ లో నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ సెంట్రింగ్ రాడ్స్  కొట్టుకుపోయాయి. అదే విధంగా ముసరాంబాగ్ బ్రిడ్జి సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ బస్తీలోనీ ఇళ్లలోకి  వరద నీరు రావడంతో జనాలు బయటకు వెళ్లి ఎత్తైన ప్రదేశంలో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో చూస్తున్నారు. 

వరద నీటితో బస్తీ ముంపుకు గురైన విషయం తెలిసి ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య, అంబర్పేట్ పోలీసులు బస్తీకి చేరుకున్నారు. వరద నీటిలో ఇళ్లల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహం తో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వెయ్యి మందికి పైగా ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు . 
క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై  ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్.