గత కొద్దివారాలుగా భారత కరెన్సీ 'రూపాయి' మునుపెన్నడూ లేనంతగా బలహీనపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్, భౌగోళిక రాజకీయ అనిశ్చితి రూపాయిని గరిష్ట పతనానికి గురిచేస్తున్నాయి. డిసెంబర్ 16, 2025 నాటికి ఒక డాలర్ విలువ దాదాపు రూ.91కి చేరుకోవడంతో ప్రభుత్వంపై కూడా ఒత్తడి పెరుగుతోంది.
ప్రభుత్వ వివరాల ప్రకారం రూపాయి పతనం గత నెల రోజుల్లో వేగవంతమైంది:
* నవంబర్ మూడో వారం: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.41.
* డిసెంబర్ ఆరంభం: 89.64 వద్దకు చేరిక.
* డిసెంబర్ 4: కీలకమైన 90 మార్కును దాటి 90.42కు పతనం.
* డిసెంబర్ 16: ప్రస్తుతం 91 స్థాయికి అత్యంత చేరువలో ట్రేడ్ అవుతోంది.
రూపాయి పతనానికి ప్రధాన కారణాలివే..
రూపాయి ఎందుకు బలహీనపడుతోందన్న ప్రశ్నకు ప్రభుత్వం పలు అంతర్జాతీయ, దేశీయ కారణాలను వివరించింది. అమెరికా డాలర్ ఇండెక్స్ బలంగా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ప్రధాన కారణాలుగా నిలిచాయి. వీటికి తోడు..
1. ముడి చమురు ధరలు: అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు దిగుమతి భారాన్ని పెంచుతున్నాయి. ఇది డాలర్లకు డిమాండ్ పెంచుతోంది.
2. వాణిజ్య లోటు: ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగింది.
3. అమెరికాతో వాణిజ్య ఒప్పందం: అమెరికాతో కొత్త ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లడం కూడా రూపాయి పతనానికి కారణంగా ఉంది.
మరి RBI ఏం చేస్తోంది?
రూపాయి విలువను ఒకే స్థాయిలో ఉంచాలని ప్రభుత్వం లేదా ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోవు. మార్కెట్లో సప్లై డిమాండ్ వంటి అంశాల ఆధారంగానే కరెన్సీ రేటు మారుతుంది. అయితే, రూపాయి విలువలో మరీ వేగంగా ఒడిదుడుకులు రాకుండా ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా డాలర్ల కొనుగోలు, విక్రయాల ద్వారా మార్కెట్‌ను సమతుల్యం చేయడం, ఎగుమతిదారులకు క్రెడిట్ పరిమితిని పెంచి విదేశీ కరెన్సీ వచ్చేలా చూడటం, పొరుగు దేశాలతో రూపాయిలోనే వాణిజ్యం సాగేలా చర్యలు చేపట్టడం ఇందులో లాంటి చర్యలు చేపడుతోంది సెంట్రల్ బ్యాంక్. రూపాయి బలహీనపడటం వల్ల ఐటీ, ఫార్మా వంటి ఎగుమతిదారులకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే వారు పొందే ప్రతి డాలర్‌కు ఎక్కువ రూపాయలు వస్తాయి కాబట్టి. అయితే దీనివల్ల పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారం పడే అవకాశం ఉంది.
