Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ ఆటలో ఓడినా.. భారీ రెమ్యునరేషన్‍తో భరణి రికార్డ్! ఎంతంటే?

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ ఆటలో ఓడినా.. భారీ రెమ్యునరేషన్‍తో భరణి రికార్డ్! ఎంతంటే?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-9 షో తుదిపోరుకు సిద్ధమైంది. టైటిల్ రేస్‌లో ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ మధ్య.. డిసెంబర్ 21న గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. ఈ సీజన్‌లో కప్పు కోసం పోటీపడే టాప్‌-5 ఫైనలిస్ట్‌లు ఖరారయ్యారు. వారిలో తనూజ, కల్యాణ్‌ పడాల, ఇమ్మాన్యుయేల్‌, డిమోన్‌ పవన్‌, సంజన గల్రానీ ఉన్నారు. ఇక వారం రోజుల్లో విజేత ఎవరో తేలనుండగా, చివరి ఎలిమినేషన్లలో భాగంగా సుమన్‌ శెట్టి శనివారం, ఆ తర్వాత రోజు భరణి హౌస్ నుండి నిష్క్రమించారు. అయితే, భరణి ఆటలో ఓడినా, బిగ్‌బాస్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును మాత్రం సృష్టించారు. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్‌గా నిలిచారు!

రీఎంట్రీతో రికార్డు సృష్టించిన భరణి!

నటుడిగా మంచి గుర్తింపు ఉన్న భరణి.. ఈ సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టిన అత్యంత పేరున్న సెలబ్రిటీలలో ఒకరు. అందుకే ఆయనకు మిగిలిన కంటెస్టెంట్‌ల కంటే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ప్యాకేజీ లభించినట్లు ఇండస్ట్రీ వర్గా్ల్లో టాక్ వినిపిస్తోంది. భరణికి వారానికి రూ. 3.5 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరో వారంలోనే తొలిసారిగా ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆరు వారాలకు గాను భరణి సుమారు రూ. 21 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం.. అయితే, ఈ షోకు ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. ఎనిమిదో వారంలో భరణి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గ్రాండ్‌ ఫినాలేకు ముందు వరకు అంటే, మరో ఆరు వారాల పాటు హౌస్‌లో కొనసాగారు.

►ALSO READ | Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌ 9 ఫినాలే ఫైట్.. టాప్‌ 5 కంటెస్టెంట్లలో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఎవరి సొంతం?

మొత్తం సంపాదన

రీఎంట్రీ తర్వాత కూడా అదే వారపు రెమ్యునరేషన్ లెక్కించినట్లయితే.. భరణి మరో రూ. 21 లక్షలు అందుకున్నట్లు అంచనా. మొత్తంగా చూస్తే, భరణి ఈ సీజన్‌లో బిగ్‌బాస్ ద్వారా ఏకంగా రూ. 42 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మొత్తం, ఫైనల్‌కు చేరుకున్న కంటెస్టెంట్‌లు గెలుచుకునే ప్రైజ్‌మనీ రూ. 50 లక్షలకి దాదాపు సమానం ఉంది. టైటిల్ గెలవకపోయినా, అత్యధిక పారితోషికం అందుకున్న వ్యక్తిగా భరణి ఈ సీజన్‌లో భారీగా లాభపడ్డారని తెలుస్తోంది..

 రూ. 50 లక్షల ప్రైజ్‌మనీని గెలిచేదెవరు?

ఇక భరణి ఎలిమినేట్ అయినప్పటికీ, హౌస్‌లో ఆయన క్రియేట్ చేసిన ఎమోషనల్ బాండ్‌లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కల్యాణ్‌ పడాలపై చూపిన అభిమానం, తనూజకు ఇచ్చిన బూస్టింగ్ మాటలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక బిగ్‌బాస్‌ టైటిల్‌ రేసులో ఉన్న తనూజ, కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, పవన్‌, సంజనలలో ఎవరు విజేతగా నిలుస్తారో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సీజన్ బిగ్ బాస్ రూ. 50 లక్షల ప్రైజ్‌మనీని ఎవరు సొంతం చేసుకుంటారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.