Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌ 9 ఫినాలే ఫైట్.. టాప్‌ 5 కంటెస్టెంట్లలో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఎవరి సొంతం?

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌ 9 ఫినాలే ఫైట్.. టాప్‌ 5 కంటెస్టెంట్లలో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఎవరి సొంతం?

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-9 షో తుది అంకానికి చేరుకుంది. మరో ఏడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. హౌస్ లో బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం పోటీపడే టాప్‌ 5 ఫైనలిస్ట్‌లు ఎవరనేది అధికారికంగా ఖరారైంది. వారిలో కల్యాణ్‌ పడాల, డిమోన్‌ పవన్‌, తనూజ,  ఇమ్మాన్యుయేల్‌ , సంజన గల్రానీ .  వారాంతంలో జరిగిన ఊహించని డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియతో ఈ ఐదుగురు కంటెస్టెంట్‌లు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. శనివారం ఎపిసోడ్‌లో సుమన్‌శెట్టి ఎలిమినేట్ కాగా, ఆదివారం ఎపిసోడ్‌లో హౌస్‌లో బలమైన ఆటగాడిగా పేరున్న భరణి నిష్క్రమించారు. ఈ నిష్క్రమణతో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సుమన్, భరణి ఒకే వారం హౌస్‌ను వీడటం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ప్రైజ్‌మనీపై ఫైనలిస్ట్‌ల ఆశలు!

బిగ్ బాస్ షో హోస్ట్ అక్కినేని నాగార్జున, ఫైనల్‌కు చేరిన కంటెస్టెంట్‌లతో ఆసక్తికరమైన చర్చను జరిపారు. ఈ సీజన్ ప్రైజ్‌మనీగా ప్రకటించిన రూ.50 లక్షలు మీ సొంతమైతే ఏం చేస్తారని వారిని అడిగారు. దీనికి తొలుత డిమోన్‌ పవన్‌ కన్నీళ్లతో తన తండ్రి క్యాన్సర్‌ చికిత్స కోసం డబ్బును ఉపయోగిస్తానని, అలాగే అమ్మానాన్న కోసం ఒక ఇల్లు కడతానని చెప్పి అందరినీ కదిలించారు. ఇక ఇమ్మాన్యుయేల్‌ ఇంటి అప్పులు తీర్చి, తన ప్రియురాలి చదువు, అక్క పిల్లల బాగోగులు చూస్తానని తన ప్రణాళికను పంచుకున్నారు.

►ALSO READ | Thaman Akhanda 2: ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. వెన్నుపోట్లే ఎక్కువయ్యాయి.. తమన్ సంచలన వ్యాఖ్యలు

సంజన గల్రానీ మాత్రం తన ప్రైజ్ మనీని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంఘానికి కొంత విరాళం ఇస్తానని, దివ్యాంగుల కోసం కృత్రిమ కాళ్లు కొనిస్తానని, అలాగే తన పిల్లల కోసం రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తానని తెలిపారు. తనూజ పేద పిల్లల చదువుకు సాయం చేస్తానని చెప్పారు. ఇక కల్యాణ్‌ మాత్రం అనాథాశ్రమంలో ఒకరిద్దరిని దత్తత తీసుకుంటానని, తన తల్లికి బంగారం కొనిస్తానని తమ గొప్ప మనసును చాటుకున్నారు.

 భరణి ఎమోషనల్ వీడ్కోలు

ఇక భరణి ఎలిమినేషన్ తర్వాత, తనూజ అతని కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. స్టేజీపైకి వచ్చిన భరణి.. టాప్‌ 5 కంటెస్టెంట్‌లను 'ఫైటర్స్' అని ప్రశంసించారు. ముఖ్యంగా కల్యాణ్‌ పడాలకు 'సైనికా, వందనం' అంటూ సెల్యూట్‌ చేసి, కప్పు గెలిచే అర్హత అతనికి ఉందని చెప్పారు. తనూజతో మాట్లాడుతూ.. ఆమె తప్పకుండా కప్పు గెలవాలని కోరుకుంటూ, ఆమె పెళ్లికి ఆహ్వానించాలని ఆకాంక్షించారు. భరణి ఇచ్చిన ఈ బూస్టింగ్‌తో తనూజ ట్రోఫీ కొడతానని మాటిచ్చింది. హౌస్‌మేట్స్‌లో ఉన్న తన అనుబంధాలను గుర్తుచేసుకుంటూ, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి భావోద్వేగంగా నిష్క్రమించారు.

టైటిల్ విజేత మీ చేతుల్లోనే!

చివరిగా నాగార్జున మాట్లాడుతూ, ఇప్పటివరకు తమకు నచ్చిన కంటెస్టెంట్‌లను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసేందుకు ఓట్లు వేసిన ప్రేక్షకులు, ఇకపై టైటిల్ విజేతను గెలిపించేందుకు ఓటింగ్ వేయాలని కోరారు. శుక్రవారం అర్థరాత్రి వరకూ ఓటింగ్ లైన్స్ తెరిచి ఉంటాయని, విన్నర్ ఎవరనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 9 టైటిల్ పోరు అత్యంత రసవత్తరంగా మారింది. ఈ ఐదుగురు ఫైనలిస్ట్‌లలో తనూజ, కల్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్‌, సంజనలలో ఎవరు విజేతగా నిలుస్తారో, రూ.50 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారో తెలుసుకోవాలంటే.. ఈ ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే!