Thaman Akhanda 2: ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. వెన్నుపోట్లే ఎక్కువయ్యాయి.. తమన్ సంచలన వ్యాఖ్యలు

Thaman Akhanda 2: ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. వెన్నుపోట్లే ఎక్కువయ్యాయి.. తమన్ సంచలన వ్యాఖ్యలు

‘మన తెలుగు ఇండస్ట్రీకి బయట దేశాల్లో మంచి పేరు ఉంది. కానీ మనలో మనకే ఆ యూనిటీ లేదు. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండ్‌ ఎయిడ్‌ వేయండి. దాని గురించి బయటకు వెళ్లి బ్యాండ్‌ వేయకండి’ అని ఎస్.ఎస్ తమన్ (SS Thaman)అన్నారు. ఇపుడు ఈ మాటలు సోషల్ మీడియాలోనే కాదు.. సినీ పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. అఖండ 2 విషయంలో జరిగిన ప్రతి విషయం గురించి తనదైన కోణంలో మాట్లాడారు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

లేటెస్ట్గా జరిగిన అఖండ 2 సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా తమన్ మాట్లాడిన మాటలు సినీ ఇండస్ట్రీని ఆలోచనలో పడేసింది. డిసెంబర్ 5న రావాల్సిన అఖండ 2.. వారం పోస్ట్ ఫోన్ అయ్యి డిసెంబర్ 12న వచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, ‘వాళ్ళు అనుకుంటే ముందే అఖండ 2 నిర్మాతల పైన కేసు వెయ్యొచ్చు. కానీ విడుదల చివరిక్షణంలో వచ్చి ఆపారు. ఇక్కడే అర్ధం అవుతుంది తెలుగు సినిమాలో యూనిటీ లేదు’ అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు.

తమన్ మాట్లాడుతూ..‘‘అఖండ 2 వారం ఆలస్యంగా విడుదలైంది. వాళ్ళు అనుకుని ఉంటే ముందు కేసు వేయవచ్చు. లేకుంటే ఎప్పుడో ఆపి ఉండవచ్చు.కానీ, చివరి నిమిషంలో వచ్చి ఆపారు. దీని బట్టి తెలుస్తుంది ఏంటంటే.. మన మధ్య యూనిటీ లేదు. అందరూ మాదే.. నాదే.. మేమే అంటున్నారు. అందరూ కలిసుంటే ముందుకెళ్తాం. మనం అనుకుంటే ఎదుగుతాం. చాలా మంది వివిధ స్టూడియోలకు వెళ్లి సలహాలు ఇచ్చారు. అదేదో ప్రొడక్షన్ హౌస్‌కు వచ్చి ఇస్తే నిర్మాతలకు ఇంకా బలం వచ్చేది. ఎవరిని అడిగినా నిర్మాతలు మంచి వాళ్ళు అని చెబుతున్నారు. అలాంటప్పుడు తప్పుగా ఎందుకు మట్లాడాలి? అందరూ వచ్చి కూర్చుని మాట్లాడితే సమస్య క్లియర్ అవుతుంది. కానీ ఛానల్ మైక్ దొరికితే మాట్లాడడం తప్పు కదా.

ఇండస్ట్రీలో ఐక్యత లేదు. అందరూ కలిసి ఉండే సమయం వచ్చింది. అందరూ కష్టపడితే సినిమా వస్తుంది. నాలుగు గోడల మధ్య జరగాల్సింది.. అందరికీ బ్యాడ్గా కన్వే అయింది. టాలీవుడ్ గొప్ప ఇండస్ట్రీ. బయట ఎంతో పేరు ఉంది. ఇంత మంది హీరోలు, ఈ స్థాయి అభిమానులు ప్రపంచంలో ఏ లాంగ్వేజ్లో ఎక్కడా లేరు. అందుకే తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలింది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నెగెటివిటీ పెరిగిపోయింది.

అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండ్‌ ఎయిడ్‌ వేయండి. దాని గురించి బయటకు వెళ్లి బ్యాండ్‌ వేయకండి. చాలా తప్పు అది. చివరి నిమిషంలో నిర్మాతలు ఎందుకు ఆపుతారు? ఆ సమయంలో ఎంత కుమిలిపోయి ఉంటారు? వాళ్లకు కూడా ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు. ఆలోచించకుండా అనేశారు’’ అని తమన్ ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. 

అలాగే, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ..  సినిమా ఇండస్ట్రీ కలుషితమైపోయింది. ఇక్కడ వెన్నుపోట్లే ఎక్కువయ్యాయి. మన ఇండస్ట్రీలో ఉన్నంత మ్యూజిక్‌ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలోనూ లేరు. అనిరుధ్‌కు మనదగ్గర తెలుగులో సినిమా ఛాన్స్‌ రావడం చాలా ఈజీ. కానీ నాకు తమిళంలో అవకాశం రావడం చాలా కష్టం. అక్కడ నాకు అవకాశాలివ్వరు. తమిళనాడులో ప్రాంతీయభావం ఎక్కువ. అందువల్ల వేరేవాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ, ఇక్కడ ఆ ఐక్యత లేదు. 

దేశంలో ఎక్కడినుంచి వచ్చినా మనవాళ్లు యాక్సెప్ట్‌ చేస్తారు. పోటీని నేను తప్పుపట్టను. అది మంచిదే! దర్శకులు వేరేవాళ్లను రిఫర్‌ చేస్తున్నారంటే వాళ్లేం కోరుకుంటున్నారో అది నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. తమిళ, కన్నడ, మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్లందరూ తెలుగులో పని చేస్తున్నారు అని తమన్ రియాలిటీని చెప్పుకొచ్చారు.  ఈ క్రమంలో తమన్ అభిప్రాయం పైనా సినీ పెద్దల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అనే ఆసక్తి నెలకొంది.