బ్యూనస్ ఎయిర్స్: అమెరికా ఆతిథ్యమిస్తున్న సాకర్ వరల్డ్ కప్ అనగానే అర్జెంటీనాకు 1994 చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆ ఏడాది రెండో గ్రూప్ మ్యాచ్ తర్వాత ఆ దేశ ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనా డోపింగ్ పరీక్షలో పట్టుబడి అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత మారడోనా మళ్లీ వరల్డ్ కప్‌లో ఆడలేదు. అర్జెంటీనా కూడా ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఆ ఘటన జరిగిన 32 ఏళ్ల తర్వాత మారడోనా వారసుడు లియోనల్ మెస్సి విషయంలోనైనా ఒక మధురమైన ముగింపు చూడాలని అర్జెంటీనా అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ నెలలో 39వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మెస్సికి ఇదే చివరి వరల్డ్ కప్ కానుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా దిగుతున్న అర్జెంటీనా ఈసారి కూడా కప్ గెలిస్తే బ్రెజిల్ (1962) తర్వాత వరుసగా రెండుసార్లు వరల్డ్ కప్ సాధించిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. ఈ ఫీట్‌ను మెస్సి పూర్తి చేస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. . సుదీర్ఘ కెరీర్ కారణంగా మెస్సి శరీరంపై వయసు ప్రభావం కనిపిస్తోంది. తన ఆరో ప్రపంచకప్ బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్న ఆయన ప్రస్తుతం హామ్‌స్ట్రింగ్ (నరాల) సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన రికార్డు మెస్సి పేరిట ఉంది. జర్మనీ ఆటగాడు మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న 16 ప్రపంచకప్ గోల్స్ రికార్డును అధిగమించడానికి మెస్సికి మరో 4 గోల్స్ అవసరం.
