
స్టావాంగర్ (నార్వే): నార్వే చెస్ టోర్నమెంట్‌ను వరల్డ్ చాంపియన్, ఇండియా స్టార్ డి. గుకేశ్ ఓటమితో ఆరంభించగా.. తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ శుభారంభం చేశాడు. వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్‌తో సోమవారం రాత్రి జరిగిన తొలి రౌండ్ క్లాసికల్ గేమ్‌లో గుకేశ్ ఓటమి పాలయ్యాడు. గుకేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకు కార్ల్‌సెన్ జోబావా లండన్ అనే అరుదైన ఓపెనింగ్‌తో ఆట ఆరంభించాడు. అయితే, నల్ల పావులతో ఆడిన గుకేశ్ కార్ల్‌సెన్ వ్యూహాన్ని తిప్పికొట్టి 11వ ఎత్తులోనే పైచేయి సాధించాడు. కానీ, దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో తన అనుభవాన్ని రంగరించిన కార్ల్‌సన్ 56 ఎత్తుల అనంతరం గుకేశ్‌ను ఓడించి మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఇదే రౌండ్‌లో అర్జున్ అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. చైనాకు చెందిన వీ యితో జరిగిన క్లాసికల్ 54 ఎత్తుల తర్వాత డ్రా అవ్వడంతో విజేతను నిర్ణయించడానికి ఆర్మగెడాన్ నిర్వహించారు. ఇందులో తెల్ల పావులకు 10 నిమిషాలు, నల్ల పావులకు 7 నిమిషాలు సమయం ఉంటుంది. నల్ల పావులతో ఆడిన అర్జున్ తక్కువ సమయం ఉన్నప్పటికీ వీ యిని ఓడించి ఔరా అనిపించాడు. దాంతో 1.5 పాయింట్లతో తొలి రౌండ్‌ను ముగించగా వీరి ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం, క్లాసికల్ గేమ్‌లో గెలిస్తే మూడు పాయింట్లు, డ్రా అయితే ఒక్కో పాయింట్ లభిస్తాయి. ఆర్మగెడాన్‌లో గెలిచిన వారికి 0.5 పాయింట్లు అదనంగా వస్తాయి.