పనాజీ: చెస్ వరల్డ్ కప్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. అతనితో పాటు మరో తెలుగు ఆటగాడు పెంటేల హరికృష్ణ ముందంజ వేయగా.. ఆర్. ప్రజ్ఞానంద టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం జరిగిన నాలుగో రౌండ్ టై బ్రేక్స్‌లో అర్జున్ అదరగొట్టాడు. రెండు ర్యాపిడ్ గేమ్స్‌లో హంగేరికి చెందిన పీటర్ లెకోను వరుసగా 40, 57 ఎత్తుల్లో ఓడించాడు. ఫలితంగా 3–1తో గెలిచి ముందంజ వేశాడు.
స్వీస్ జీఎం నిల్స్ గ్రాండెలియస్తో తొలి బ్రేక్‌ను 35 ఎత్తుల్లో డ్రా చేసుకున్న హరికృష్ణ రెండో టై బ్రేక్‌లో తెల్లపావులతో ఆడి 34 ఎత్తుల్లో గెలిచాడు. ఓవరాల్‌గా 2.5–1.5తేడాతో నిల్స్‌ను ఓడించాడు. ఇక, భారీ అంచనాలున్న ప్రజ్ఞా నిరాశపరిచాడు. తొలి టై బ్రేక్‌ను డ్రా చేసుకొని, రెండో గేమ్‌లో 53 ఎత్తుల్లో ఓడిన అతను 1.5–2.5 తేడాతో డానిల్ డుబో ( రష్యా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇతర టై బ్రేక్స్‌లో నెగ్గిన అలెక్సే గ్రెబ్నెవ్ (రష్యా), సామ్ శాంక్‌లాండ్ (అమెరికా) కూడా ముందంజ వేశారు.
