పీఎం టూర్‌‌‌‌కు పకడ్బందీ ఏర్పాట్లు

పీఎం టూర్‌‌‌‌కు పకడ్బందీ ఏర్పాట్లు
  • బ్లూ బుక్​ ప్రకారం భద్రత: సీఎస్​ సోమేశ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: పీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్ ​పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్​ సోమేశ్ కుమార్​ ఆఫీసర్లను ఆదేశించారు. పీఎం టూర్​ను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు.  ప్రధాని పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్‌‌‌‌ నియంత్రణ, బందోబస్తును బ్లూబుక్‌‌‌‌ ప్రకారం అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ నెల 5వ తేదీన పీఎం నరేంద్ర మోడీ ముచ్చింతల్, ఇక్రిశాట్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో బీఆర్కే భవన్​లో సీఎస్ ​రివ్యూ నిర్వహించారు. వీవీఐపీ పర్యటన సమయంలో కరోనా ప్రొటోకాల్స్‌‌‌‌ పాటించేలా చూడాలని హెల్త్​సెక్రటరీని సీఎస్ ఆదేశించారు. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌‌‌‌కు ముందే ఆర్టీ పీసీఆర్​ టెస్టులు చేయాలన్నారు. పీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్​బీ అధికారులను​ ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలించాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

మొదలు ఇక్రిశాట్​కు..
హైదరాబాద్​ రానున్న ప్రధాని 5వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్రిశాట్ ను సందర్శించి వార్షికోత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్​లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం ఆవిష్కరించి, జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో రామానుజాచార్య జీవన ప్రయాణం, ఆయన బోధనలకు సంబంధించిన 3డి ప్రజెంటేషన్ మ్యాపింగ్ ప్రదర్శిస్తారు. 108 దివ్య క్షేత్రాల నిర్మాణాలను కూడా పీఎం సందర్శించనున్నారు.