భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌: క‌ల్న‌ల్, ఇద్ద‌రు జ‌వాన్ల మృతి.. ఐదుగురు చైనా సైనికులూ..

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌: క‌ల్న‌ల్, ఇద్ద‌రు జ‌వాన్ల మృతి.. ఐదుగురు చైనా సైనికులూ..

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు ప‌ర‌స్ప‌రం దాడుల‌కు దిగారు. వాస్త‌వాధీన రేఖ వెంట‌ దాదాపు నెల రోజుల పైగా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో ప‌రిస్థితులను చ‌క్క‌దిద్దేందుకు ఆర్మీ ఉన్న‌తాధికారుల చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో సైనికుల మ‌ధ్య అనూహ్యంగా హింసాత్మ‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. సోమ‌వారం రాత్రి స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి ఇరు దేశాల సైనికులు రాళ్లు, ఇనుప రాడ్లు వంటి వాటితో కొట్లాట‌కు దిగారు. ఈ ఘ‌ట‌న‌లో భార‌త్‌కు చెందిన ఒక క‌ల్న‌ల్, మ‌రో ఇద్ద‌రు సైనికులు అమ‌రుల‌య్యారు. భార‌త భూభాగంలోకి దూసుకొచ్చిన చైనా ఆర్మీ జ‌వాన్ల‌ను అడ్డుకున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప‌ర‌స్ప‌రం హోరాహోరీగా జ‌రిగిన దాడిలో చైనా ఆర్మీకి చెందిన న‌లుగురైదుగురు సైనికులు మ‌ర‌ణించినట్లు ఆ దేశ మీడియా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తోంది. అనేక సంద‌ర్భాల్లో చైనా – భార‌త్ స‌రిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు ఎదురుప‌డిన‌ప్పుడు ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ప్ప‌టికీ ఎప్పుడూ మ‌ర‌ణాలు సంభ‌వించిన సంద‌ర్భాలు లేవు. అయితే 45 ఏళ్ల క్రితం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సరిహ‌ద్దు ప్రాంతంలో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో న‌ల‌గురు భార‌త జ‌వాన్లు మ‌ర‌ణించారు. మ‌ళ్లీ అంత‌టి స్థాయిలో సైనికులు ప‌ర‌స్ప‌రం హింస‌కు దిగి ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇదే. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఇరు బ‌ల‌గాలు కూడా తుపాకీ కాల్పుల‌కు దిగ‌లేద‌ని సైనిక వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై ఇవాళ ఉద‌యం ఇరు దేశాల ఆర్మీ అధికారులు స‌మావేశ‌మై.. ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఆర్మీ ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మై స‌మీక్షించారు. దీనిపై ఇవాళ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

ల‌ఢ‌ఖ్‌లోని గల్వాన్‌ లోయ వద్ద భారత్‌ చెందిన బోర్డర్‌ రోడ్ ఆర్గనైజేషన్‌ ఆధ్వరంలో డర్బుక్‌-ష్యంకు- దౌలత్‌బేగ్‌ ఓల్డీకి 255 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తున్న నేప‌థ్యంలో చైనా దీనిపై అభ్యంత‌రం చెబుతోంది. ఈ ప్రాంతం త‌మ‌దేనంటూ భార‌త భూభాగంలోకి చొచ్చుకుని వ‌చ్చి తిష్ట వేసింది. ప్యాంగాంగ్ లేక్ స‌హా ప‌లు ప్రాంతాల్లోకి చొచ్చుకుని వ‌చ్చిన చైనా సైనికులు భార‌త సైనికుల‌పై ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగాయి. ఏప్రిల్ చివ‌రిలోనూ ఇలానే ప‌రస్ప‌ర ఘ‌ర్ష‌ణ‌లో ఇరు దేశాల సైనికుల‌కు గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న త‌ర్వాత ఆర్మీ అధికారులు, దౌత్య చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఈ చ‌ర్చ‌ల త‌ర్వాత చైనా ఆర్మీ మ‌న భూభాగాల‌ను విడిచి వెన‌క్కి వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో గాల్వ‌న్ లోయ వ‌ద్ద హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో ప‌రిస్థితులు ఎటు దారి తీస్తాయోన‌న్న టెన్ష‌న్ నెల‌కొంది.