ఆర్మీ కాల్పుల్లో 44 మంది చిన్నారులు బలి

ఆర్మీ కాల్పుల్లో 44 మంది చిన్నారులు బలి
  • మయన్మార్‌‌‌‌లో 44 మంది చిన్నారులు బలి.. కాల్పుల్లో 543 మంది ప్రజలు మృతి

యాంగన్: అభం శుభం తెలియని పసిపిల్లలు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 44 మంది అన్యాయంగా బలైపోయారు. వీరిలో చాలా మందిని వారి ఇండ్లలోనే చంపేశారు. మయన్మార్లో ఆర్మీ జుంటా (మిలిటరీ ప్రభుత్వం) అరాచకాలకు ఆ పసిబిడ్డలు బలైపోయారు. శుక్రవారం నాటివరకూ మయన్మార్ లో ఆర్మీ, పోలీసుల కాల్పుల్లో 543 మంది పౌరులు మృతి చెందారని, వీరిలో 44 మంది చిన్నారులు కూడా ఉన్నారని ఈ మేరకు అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ (ఏఏపీపీ) సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2,700కుపైగా మందిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయని పేర్కొంది. ఫిబ్రవరి1న ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి, అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఆర్మీ జుంటాకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్ లు, రబ్బర్ బుల్లెట్లు, అసలు బుల్లెట్లను విచ్చలవిడిగా ప్రయోగిస్తున్నారు. అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు పెట్టినా, సూచనలు, హెచ్చరికలు చేసినా ఆర్మీ జుంటా వెనక్కి తగ్గడంలేదు. మయన్మార్ లో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, యాక్టివిస్టులు, అధికారులు సహా వందలాది మందిని ఆర్మీ జుంటా బలవంతంగా దాచిపెడుతోందని న్యూయార్క్ కు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వారి గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలేదని, లాయర్లతో మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించడంలేదని తెలిపింది. కాగా, మయన్మార్ లో హింసను ఖండిస్తున్నామని, దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తిరిగి అధికారం అప్పగించాలని ఇండియా స్పష్టం చేసింది.