సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నం: ఎమ్మెల్యే రాజా సింగ్ సహా నేతల అరెస్ట్

సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నం: ఎమ్మెల్యే రాజా సింగ్ సహా నేతల అరెస్ట్

వాస్తు దోషం పేరుతో అసెంబ్లీ, సెక్రటేరియట్ లను కూల్చడం ఏంటి..

తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం

బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు బీజేపీ నేతలు. కొత్త సెక్రటేరియట్ భూమిపూజను అడ్డుకునేందుకు  పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందే అలర్ట్ అయిన పోలీసులు.. బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొత్త నిర్మాణాల పేరుతో ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు.

సెక్రటేరియట్ ను ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, MLCరాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీనిపై మాట్లాడిన రాజాసింగ్… వాస్తు దోషం పేరుతో అసెంబ్లీ, సచివాలయాలను కూల్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం వద్దు అన్నందుకే కేసీఆర్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిందన్నారు. పేదల కోసం రెండు లక్షల ఇళ్లను నిర్మిస్తామన్న కేసీఆర్… కనీసం 20వేల ఇళ్లను కూడా కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృథా అవుతున్న ప్రజాధనాన్ని ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత భారీ మొత్తంతో కొత్త సచివాలయం కట్టే బదులుగా, ఆ మొత్తాన్ని ఉస్మానియా ఆస్పత్రి పునరుద్ధరణ, స్కూళ్ల నిర్మాణం కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్‌.