మూసాపేట, వెలుగు : కర్ణాటక నుంచి అక్రమంగా మిలటరీ మద్యం తీసుకొచ్చి అమ్మేందుకు యత్నిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బాలానగర్ ఎక్సైజ్ పీఎస్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి జోన్ సహాయ కమిషనర్ చంద్రయ్య వివరాలు వెల్లడించారు. రసూల్‌పురాకు చెందిన అన్నపురెడ్డి వెంకట కృష్ణారెడ్డి పోలీసు శాఖలో హోంగార్డు. తన సోదరుడు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మాజీ సైనికుల నుంచి మద్యం తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మేవాడు. పోలీసుశాఖలో తనకున్న పరిచయాలతో తెలంగాణ, కర్ణాటకలో సచిన్ అనే వ్యక్తి నుంచి మద్యం కొనుగోలు చేసేవాడు. వెంకట కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇద్దరూ డిఫెన్స్ మద్యాన్ని సిటీకి తీసుకొచ్చినట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు సోమవారం ఉదయం బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరిని తనిఖీ చేశారు. 64 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి ఇండ్లకు తీసుకెళ్లి తనిఖీ చేసి.. అక్కడ మరో 32 బాటిళ్లను గుర్తించి సీజ్ చేశారు.

