India vs Pakistan Women's T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కాసేపట్లో (జూన్ 14) పాకిస్తాన్‌తో జరగబోయే మోస్ట్ అవేటెడ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మైదానం వెలుపల జరిగే చర్చలు, వివాదాల కంటే తమ జట్టు పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టిందని స్పష్టం చేసింది. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో.. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో ఆమె కరచాలనం (Handshake) చేస్తుందా లేదా? అనే ప్రశ్న ఎదురవగా, హర్మన్ చాలా హుందాగా సమాధానమిచ్చింది. డ్రెస్సింగ్ రూమ్‌లో తమ చర్చలన్నీ కేవలం మ్యాచ్ ప్రణాళికలు, సన్నద్ధత, ప్రదర్శన చుట్టూనే సాగుతాయని, ఇటువంటి అంశాలకు తాము అస్సలు ప్రాధాన్యత ఇవ్వమని తేల్చి చెప్పింది.
హ్యాండ్‌షేక్ వివాదానికి చెక్:
భారత్ వర్సెస్ పాక్ జట్ల మధ్య ఉండే పోటీ కారణంగా మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన, మ్యాచ్ ముగిసిన తర్వాత ఒకరినొకరు పలకరించుకునే విధానాలపై మీడియా, అభిమానుల్లో ఎప్పుడూ భారీగా ఆసక్తి నెలకొంటుంది. గతంలో జరిగిన కొన్ని మ్యాచ్‌ల ఇంటరాక్షన్లు నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ 'కరచాలనం' అంశం తెరపైకి వచ్చింది. కానీ, ఇలాంటి విషయాలపై మాట్లాడే అవసరం లేదని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొనింది.
►ALSO READ | భారత్ vs పాక్ మెగా ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్ ఇదే!
సెమీస్ రేసులో ప్రతి మ్యాచ్ పక్కా ఇంపార్టెంట్:
ఈ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ గ్రూప్‌లో ప్రతి మ్యాచ్ ఫలితం సెమీఫైనల్ రేసుకు అత్యంత కీలకమని, అందుకే అనవసర విషయాలకు చోటివ్వకుండా మంచి ప్రదర్శన చేయడమే తమ ఏకైక లక్ష్యమని భారత కెప్టెన్ హర్మన్ కౌర్ స్పష్టం చేసింది. గత రికార్డులను పరిశీలిస్తే పాకిస్తాన్‌పై టీమిండియాకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది.. ఇరు జట్లు ఇప్పటివరకు 16 టీ20ల్లో తలపడగా.. భారత్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది, పాక్ కేవలం 3 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ప్రపంచకప్ చరిత్రలో కూడా భారత్ ఆధిక్యం ప్రదర్శించింది.
కాసేపట్లో అసలైన సమరం:
ఈ ప్రతిష్టాత్మక లీగ్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత కాలమానం (IST) ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్‌లోని పిచ్ కండిషన్స్, వెదర్ రిపోర్ట్ ప్రకారం ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. గత రికార్డులు భారత్‌కు భారీగా అనుకూలంగా ఉన్నప్పటికీ, మైదానంలో ఒత్తిడిని అధిగమించి ఎవరు బెస్ట్ క్రికెట్ ఆడతారనేదే ఇక్కడ ముఖ్యం.
