చందమామకు దగ్గరగా ఆర్టెమిస్ 2.. చంద్రుడి వెనుక భాగాన్ని క్లి్క్ మనిపించనున్న ఆస్ట్రోనాట్స్

చందమామకు దగ్గరగా ఆర్టెమిస్ 2.. చంద్రుడి వెనుక భాగాన్ని  క్లి్క్ మనిపించనున్న ఆస్ట్రోనాట్స్

హ్యూస్టన్: ఆర్టెమిస్ 2 ఆస్ట్రోనాట్ల బృందం సరికొత్త  రికార్డు సృష్టించనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 యాత్ర సోమవారం కీలక దశలోకి ప్రవేశించింది. మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుడి అవతలి వైపు భాగాన్ని ఆర్టెమిస్ 2 ఆస్ట్రోనాట్లు క్లిక్ మనిపించనున్నారు. ఈ మిషన్​లో భాగంగా ఆస్ట్రోనాట్లు ఇప్పటికే చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించారు. 

ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడియన్ ను తీసుకెళ్లిన ఒరాయన్  స్పేస్ క్రాఫ్ట్.. 4,00,171 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇంత దూరం ప్రయాణించిన అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా ఇది రికార్డు సృష్టించింది.1970 ఏప్రిల్ లో అపోలో 13 వ్యోమనౌక ప్రయాణించిన దూరం కన్నా ఇది 2500 కిలోమీటర్లు  ఎక్కువ. 

ఈ క్రమంలోనే ‘లూనార్ ఫ్లైబై’ దశ చోటుచేసుకుంది. ఆ దశ తర్వాత ఒరాయన్  చంద్రుడిని దాటి 6,600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. స్పేస్ క్రాఫ్ట్  ఈ దశలో ఉండగా.. మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుడి అవతలి వైపు భాగాన్ని ఆస్ట్రోనాట్లు ఫొటో తీస్తారు. చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తయిన తర్వాత ఈ వ్యోమనౌక తిరిగి భూమి వైపు ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ నెల 10న స్పేస్ క్రాఫ్ట్  పసిఫిక్  మహాసముద్రంలో ల్యాండ్  అయ్యే అవకాశం ఉంది.