
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం (డిసెంబర్ 11న) కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు చెప్పంది. జమ్మూకశ్మీర్ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం.. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.
ఆర్టికల్ 370 తీర్పులో.. 10 కీలకమైన వ్యాఖ్యలు
- ఆర్టికల్ 370.. జమ్ము కశ్మీర్ లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఆ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370 ఏర్పాటు తాత్కాలిక వెసులుబాటు మాత్రమే తప్ప శాశ్వతం కాదు.
- ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి కేంద్రానికి రాష్ట్రం అనుమతి అవసరం లేదు.
- దేశంలో విలీనం అయినప్పుడు జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదు. విలీనం తర్వాత కూడా జమ్మూ కశ్మీర్ కు అంతర్గత సార్వభౌమాధికారం ఇవ్వలేదు.
- ఆర్టికల్ 370ను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంలో జమ్ముకశ్మీర్ కు ప్రత్యేకత ఏమీ లేదు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో అది సమానమే.
- ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం భారత్ లో జమ్మూకశ్మీర్ అంతర్భాగమే. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదు.
- ప్రభుత్వం నిష్పాక్షిక నిజం, సయోధ్య కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ అంశంతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి
- 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ నుండి లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని విభజించాలన్న నిర్ణయం చెల్లుబాటును కూడా సుప్రీం కోర్టు సమర్థించింది.
- కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రహోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- సెప్టెంబర్ 30, 2024లోగా జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రాంతంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
- జమ్మూ కాశ్మీర్‌లో 2018 డిసెంబర్‌లో విధించిన రాష్ట్రపతి పాలన చెల్లుబాటుపై తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది,
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా సోమవారం (డిసెంబర్ 11న) ఆ తీర్పును వెలువరించింది.