- ప్రజానాట్యమండలి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్రీడారంగానికి అమలు చేస్తున్న కోటా తరహాలోనే సాంస్కృతిక రంగానికి కోటా కేటాయించాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు అందించి ఆదుకోవాలని పలువురు ప్రముఖులు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ‘సమగ్ర సాంస్కృతిక విధానం- కళాకారులకు గుర్తింపు, ఉద్యోగాలు’ అనే అంశంపై బుధవారం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ జి.వి. వెన్నెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆట, పాటలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. తెలంగాణ అంటేనే కళలకు కాణాచి, విప్లవాలకు పురిటిగడ్డ అని పేర్కొన్నారు. డప్పు చప్పుడుకు ఒకరిని ఆకాశానికి ఎత్తే శక్తితోపాటు పాతాళానికి తొక్కే శక్తి కూడా ఉంటుందనే విషయాన్ని పాలకులు మర్చిపోవద్దని హెచ్చరించారు.
సాంస్కృతిక సారథి చైర్పర్సన్జి.వి. వెన్నెల మాట్లాడుతూ.. సాంస్కృతికరంగ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమగ్ర విధానంపై ఇప్పటికే నివేదిక సమర్పించామని చెప్పారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు వేసి కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని వెల్లడించారు. మరో 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. మీడియా అకాడమీ చైర్మన్ కె . శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజా కళాకారులపై పక్షపాతంతో వ్యవహరించిందని, ప్రస్తుత ప్రభుత్వం సినిమా, క్రీడా రంగాల మాదిరిగానే వీరిని ప్రోత్సహించాలన్నారు.
