పస్తుల్లో పాటగాళ్లు.. పట్టించుకోని సర్కార్

పస్తుల్లో పాటగాళ్లు.. పట్టించుకోని సర్కార్
  • సాంస్కృతిక సారథిపోస్టులను భర్తీ చేయని సర్కార్
  • రెండేండ్ల క్రితం నోటిఫికేషన్​..ఏడాది కింద ఇంటర్వ్యూలు
  • 3 నెలల్లోనే పూర్తి చేయాలన్నహైకోర్టు ఆదేశాలు బేఖాతర్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం కోసం ఆడి, పాడిన కళాకారులు ఇప్పుడు పస్తులుంటున్నరు. భుజాన గొంగడి, కాలికి గజ్జె కట్టి చిందేసిన పాటగాళ్లు చేతిలో పార,  జబ్బకు టిఫిన్​ డబ్బా కట్టుకుని  కైకిలికి పోతున్నరు. కొలువులు కాదు కదా.. చివరికి హెల్త్ కార్డులకు కూడా వారు నోచుకోవడం లేదు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడుతాయని రాత్రనక, పగలనక ఎక్కడ ‘ధూంధాం’ ఉంటే.. అక్కడికి వెళ్లి జంగ్‌ సైరన్‌ ఊదిన కవులు, గాయకులు ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నరు. తెలంగాణ ఏర్పాటైన ఏడాదికే సాంస్కృతిక సారథిలో 550 మంది కళాకారులకు కొలువులు ఇచ్చినప్పటికీ.. ఆ నియామకాలు వివాదాస్పదంగా మారి హైకోర్టు ఆదేశాలతో రద్దయినయ్​.

2014లో రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు కళాకారుల్లో కొందరికి సాంస్కృతిక సారథి పేరిట ఉద్యోగాలు ఇచ్చారు.  అయితే ఈ నియామకాలను ఇష్టారాజ్యంగా చేపట్టారని, తమకు అనుకూలంగా ఉండేవాళ్లకు ఉద్యోగాలిచ్చి.. అర్హులకు అవకాశం ఇవ్వలేదని యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన జె.రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మరో ఇద్దరు నాలుగేండ్ల కింద హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి  పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేస్తూ.. 2018 జులై 10న తీర్పునిచ్చింది. మూడు వారాల్లో నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి,  మూడు నెలల్లో ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. కానీ ఆ తర్వాత రెండు నెలలకే కేసీఆర్​ తన తొలి ప్రభుత్వాన్ని రద్దు చేయడం, ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో  తీర్పు అమలులో తీవ్ర జాప్యం జరిగింది. రెండోసారి టీఆర్ఎస్  అధికారంలోకి వచ్చాక 550 పోస్టుల భర్తీకి 2018 డిసెంబర్ నెలాఖరులో నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల  చేసి, 2019 జనవరి 1 నుంచి 19 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లికేషన్లు తీసుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మందికిపైగా  కళాకారులు ఉద్యోగాల కోసం అప్లయ్​ చేసుకున్నారు. ఆ తర్వాత మరో మూడు నెలలు లేట్​ చేసి అదే ఏడాది నవంబరు  25వ తేదీ  నుంచి డిసెంబర్​ 7 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్​

హైకోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లో పూర్తి చేయాల్సిన సాంస్కృతిక సారథి నియామకాన్ని రెండున్నరేండ్లయినా ప్రభుత్వం పూర్తి చేయలేదు. ఇంటర్వ్యూలు నిర్వహించి ఏడాది దాటినా సెలక్షన్​ లిస్టు ప్రకటించకపోవడంతో ఈ నెల 20న కళాకారులు తెలంగాణ భవన్​ను ముట్టడించి ‘ధూంధాం’ నిర్వహించారు. ఆ తర్వాత ప్రగతి భవన్​ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. కళనే నమ్ముకున్న తమకు ఉపాధి కల్పించాలని వారు కోరుతున్నారు.

ఉద్యమ పాట.. కైకిలి బాట

ఈయన మహబూబాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన గాయకుడు పాపన్న. బాల్యంలోనే పోలియోతో ఒక చేయి పని చేయకుండా పోయినప్పటికీ మరో చేత్తో డప్పు దరువు వేస్తూ పాడుతాడు. ఆయన గొంతెత్తితే సభ దద్దరిల్లిపోవాల్సిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం సభల కోసం ఊరూరా తిరిగి పాడిండు. ఇప్పుడు పొట్టకూటికోసం కైకిలికి పోతున్నడు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కోసం అప్లయ్​ చేసుకొని, ఇంటర్వ్యూకు కూడా హాజరైండు. ఏడాది దాటుతున్నా ఇప్పటికీ రిజల్ట్స్​ ఇస్తలేరు. దివ్యాంగుడైన తాను పాటనే నమ్ముకున్నానని, సర్కార్​ ఆదుకోవాలని పాపన్న కోరుతున్నడు.

కళాకారులను పట్టించుకోని సర్కార్

తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితలు, గాయకులు, ఒగ్గు, డప్పు, కోలాట  కళాకారులు, జానపద కళాకారులు అనేక మంది ఆడి పాడిన్రు. కళాకారులను ఆదుకుంటామని, సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలిచ్చి ప్రభుత్వ పథకాల ప్రచారానికి వాడుకుంటామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. అటు తర్వాత మరిచిపోయిన్రు. రెండేండ్ల కింద నోటిఫికేషన్​ ఇస్తే రాష్ట్రంలోని కళాకారులంతా అప్లయ్​ చేసుకున్నరు. ఇంటర్వ్యూలు అయిపోయి ఏడాది దాటినా ఎవరిని సెలక్ట్ చేశారో ప్రకటిస్తలేరు. ఉద్యోగాల సంఖ్యను పెంచి అర్హులైన కళాకారులందరికీ న్యాయం చేయాలి. కళాకారులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి.

– అనువోజు వెంకటేష్​, హుస్నాబాద్​, సిద్దిపేట

బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడేవరకూ ఆట, పాటలు,
డప్పు చప్పుళ్లు, గజ్జెల మోతలు ఆగకూడదు. ఉద్యమాన్ని ప్రజల వద్దకు చేర్చిన ఘనత ముమ్మాటికీ కళాకారులదే. కళాకారుల వల్లనే ఉద్యమం అజేయశక్తిగా మారింది. వారికి ఉద్యోగాలివ్వడం అనేది చాలా చిన్న అంశం. ఉద్యోగాలతో పాటు వారి కుటుంబాలకు హెల్త్‌‌కార్డులు కూడా ఇస్తాం.

– 2015 ఏప్రిల్​ 20న సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో సీఎం కేసీఆర్