గుజరాత్​లో గెలిచేది మేమే

గుజరాత్​లో గెలిచేది మేమే

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 27 ఏండ్ల తర్వాత ఓటమిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో బీజేపీ ఫ్రస్ట్రేషన్ లో ఉందని, కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయిందన్నారు. ఆదివారం గుజరాత్ లోని సూరత్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో నా అంచనాలే నిజమయ్యాయి. గుజరాత్ లో కూడా నా అంచనాలు నిజం కాబోతున్నాయి. ఇదే విషయాన్ని నేను రాతపూర్వకంగా మీ ముందు ప్రకటిస్తున్నా” అంటూ ఓ పేపర్ పై తన అంచనాలను రాసి కేజ్రీవాల్ మీడియాకు చూపించారు.

గుజరాత్ ప్రజలకు 27 ఏండ్ల తర్వాత బీజేపీ నుంచి విముక్తి లభించబోతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆప్ కే మద్దతు ఇవ్వాలని, వచ్చే ఏడాది జనవరి 31కల్లా వారికి ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్ లోనూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గుజరాత్ లో బీజేపీని చూసి జనం భయపడుతున్నారని, తాము ఎవరికి ఓటేస్తామన్నది బహిరంగంగా చెప్పేందుకు జంకుతున్నారని అన్నారు. బీజేపీకే ఓటేస్తామని బయటకు చెప్తున్న చాలా మంది.. నిజానికి ఆప్ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పారు.