9 గంటల పాటు విచారణ...కేజ్రీవాల్పై ప్రశ్నల వర్షం

9 గంటల పాటు విచారణ...కేజ్రీవాల్పై ప్రశ్నల వర్షం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసు పై ఆయన్ను సీబీఐ అధికారులు 9 గంటలపాటు విచారించారు. ఏప్రిల్ 16వ తేది  ఆదివారం ఉదయం విచారణకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాత్రి 8:30 గంటలకు సీబీఐ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి కారులో వెళ్లిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ విచారణ నేపథ్యంలో సీబీఐ ఆఫీసు ముందు  ఉదయం నుంచి ఆప్ నేతలు..,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

ఏమేమి ప్రశ్నలు వేశారంటే..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో  అరవింద్ కేజ్రివాల్ ను దాదాపుగా 9 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. సీఆర్పీసీ 161 కింద లిక్కర్ స్కామ్ పై సీఎం కేజీవాల్ స్టేట్మెంట్ ను సీబీఐ రికార్డ్ చేసుకుంది. ఈ కేసులో కేజ్రీవాల్ ను సాక్షిగానే  సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో  నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేజ్రివాల్ ను అధికారులు ప్రశ్నించారు. లిఖిత పూర్వకంగా, మౌలికంగా ఆయన నుంచి సీబీఐ అధికారులు సమాధానాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా పర్యవేక్షణలో స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. అయితే లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజీవాల్ పాత్ర గురించి ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రూ. 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్, ఇతర నిందితులతో సంబంధాలపై ఆరా తీశారు. మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయానికి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ సంబంధాలు, ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేజీవాల్ ను అధికారులు ప్రశ్నించారు.

అరెస్ట్ చేయొచ్చన్న ఊహాగానాలు..

సీబీఐ విచారణకు హాజరైన అరవింద్ కేజ్రీవాల్ ను  సీబీఐ అరెస్ట్‌ చేయవచ్చంటూ వార్తలు వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆప్‌  నేతలు  పంకజ్ గుప్తా,షెల్లీ ఒబెరాయ్, ఆలే మహమ్మద్ ఇక్బాల్  ఏప్రిల్ 16వ తేదీన  ఆదివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆప్‌ ఆఫీస్ బేరర్లు, జిల్లా అధ్యక్షులు, జాతీయ కార్యదర్శులు, పార్టీ నాయకులు కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ ఫోబియాతో బీజేపీ బాధపడుతోందని..అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నదని ఆప్ నేతలు విమర్శించారు. అరెస్ట్ అయితే తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.