
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి లొంగిపోనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగిసిందని తెలిపారు. అందువల్ల లొంగిపోవడానికి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరతానని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలను కోరారు.
" జూన్ 2న నేను లొంగిపోవాల్సి ఉంది. ఇంకా ఎంతకాలం జైలులో ఉంటానో తెలీదు. ఈసారి ఇంకా ఎక్కువ వేధింపులకు గురిచేసేలా ప్రయత్నాలు జరగొచ్చు. జైల్లో నన్ను ఎన్ని వేధింపులకు గురిచేసినా తలవంచను. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడేందుకు నేను జైలుకు వెళ్తున్నాను. బీజేపీ నేతలు నన్ను అణచివేయడానికి ప్రయత్నించారు. జైల్లో ఉన్నప్పుడు డయాబెటిస్‌కు మెడిసిన్ అందకుండా చేశారు. అరెస్టయినప్పుడు 70 కిలోలు ఉంటే..50 రోజుల జైలు శిక్షలో ఆరు కిలోలు తగ్గాను. బయటకు వచ్చిన తర్వాత ముందులాగా మళ్లీ బరువు పెరగలేదు.
దాంతో కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఢిల్లీ ప్రజల సంక్షేమమే నా ప్రధాన ధ్యేయం. నేను శారీరకంగా మీ(ప్రజలు)తో ఉండకపోవచ్చు. కానీ ఈ సమయంలో మీకు నేనొక హామీ ఇస్తున్నాను. మీకు అందుతున్న సేవల్లో భవిష్యత్తులోనూ ఎలాంటి మార్పు ఉండదు. ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్‌లు, మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ వంటి స్కీములు కొనసాగుతాయి. ఒక కొడుకులా నేను మీకోసం పనిచేశాను. ఈ రోజు మీకొక విజ్ఞప్తి చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి" అని ప్రజలను కేజ్రీవాల్ రిక్వెస్ట్ చేశారు.