కంపెనీ లాభం 215 కోట్లు..విరాళం 1,365 కోట్లు!

కంపెనీ లాభం 215 కోట్లు..విరాళం 1,365 కోట్లు!

న్యూఢిల్లీ:  ఎలక్టోరల్ బాండ్ల పేరుతో పార్టీలకు ప్రైవేట్ కంపెనీలు ఇచ్చిన విరాళాలకు సంబంధించి వింత విషయాలు బయటకొస్తున్నాయి. ప్రధానంగా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలు తమకు వచ్చిన లాభాల కన్నా వందల రెట్లు అధికంగా ఉదారంగా డొనేషన్లు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి 2019 నుంచి 2023 మధ్య రూ. 215 కోట్లు ప్రాఫిట్ రాగా.. తమకు వచ్చిన  లాభాల కంటే ఏకంగా 635% అధికంగా రూ. 1,365 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొని పార్టీలకు డొనేషన్లు ఇచ్చిన విషయం సంచలనంగా మారింది. 

అలాగే క్విక్ సప్లై చైన్ కంపెనీ కూడా నాలుగేండ్లలో రూ. 110 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. కానీ అంతకంటే 374% శాతం అధికంగా.. అంటే రూ. 410 కోట్ల మొత్తాన్ని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీలకు డొనేషన్లు ఇచ్చిన విషయం బయటపడింది. వీటి తర్వాత ఐఎఫ్​బీ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే మరో కంపెనీ కూడా గత నాలుగేండ్లలో రూ. 175 కోట్ల ప్రాఫిట్ పొందగా.. అందులో 53%  అంటే రూ.  92 కోట్లను డొనేషన్ గా ఇచ్చింది. మరో మూడు కంపెనీలు వచ్చిన లాభాల్లో 37, 24, 15 శాతాల చొప్పున విరాళాలు ఇచ్చాయి. వీటితోపాటు మరో డజనుకుపైగా కంపెనీలు తమ ప్రాఫిట్స్ లో 10 శాతంలోపు డొనేషన్లు ఇచ్చినట్లు ఈసీ వెల్లడించిన గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది.