కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వానాకాలం వడ్లు ..మళ్లా మొండికేస్తున్న మిల్లర్లు

 కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వానాకాలం వడ్లు ..మళ్లా మొండికేస్తున్న మిల్లర్లు
  •     కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వానాకాలం వడ్లు 
  •     ఇంకా మూడోవంతు మిల్లులు కూడా బ్యాంక్ గ్యారెంటీలు ఇయ్యలే 
  •     రాష్ట్రవ్యాప్తంగా 1,994  రైస్ మిల్లులు.. గ్యారెంటీ ఇచ్చింది 500 లోపే
  •     ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయింపులు
  •     గతంలో సీఎంఆర్ ఇవ్వక 338కి పైగా మిల్లర్లపై డిఫాల్టర్ల ముద్ర
  •     ఒత్తిడి పెంచకుంటే కొనుగోళ్లపై ఎఫెక్ట్!

హైదరాబాద్, వెలుగు:కొనుగోలు సెంటర్లకు వానాకాలం వడ్లు చేరుకుంటున్నా.. బ్యాంక్​ గ్యారెంటీ ఇచ్చేందుకు మిల్లర్లు మొండికేస్తున్నారు. గ్యారెంటీ ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయించాలని సర్కారు ఆదేశించగా..  కొనుగోళ్లపై ఎఫెక్ట్​ పడే అవకాశం కనిపిస్తున్నది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు వడ్లు చేరుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా యాసంగి సీజన్​ మాదిరిగానే  25 శాతం బ్యాంక్​గ్యారెంటీ ఇచ్చిన  రైస్ మిల్లులకే వానాకాలం ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,024 రా రైస్, 970 బాయిల్డ్ రైస్​ మిల్లులు కలిపి1,994 ఉండగా.. ఇప్పటివరకు 500 లోపు మిల్లులు మాత్రమే బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించాయి. ప్రస్తుతం ఈ  మిల్లులకే ధాన్యం కేటాయింపులు జరుగుతున్నాయి. సెంటర్లలో కొనుగోలు చేసిన వడ్లను వెంట వెంట తరలించాలంటే మిల్లర్లే కీలకం.  వీరిపై అధికారులు ఒత్తిడి తేకుంటే కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడే ప్రమాదముండడంతో  రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. 

పెరుగుతున్న డిఫాల్టర్ మిల్లర్ల జాబితా.. 

గత కొన్నేండ్లుగా కస్టమ్​ మిల్లింగ్‌‌‌‌‌‌‌‌ రైస్ (సీఎంఆర్) ఇవ్వకపోవడంతో 338 మిల్లర్లపై డిఫాల్టర్ ముద్ర పడింది. వీరిపై సివిల్ సప్లయ్స్ శాఖ కేసులు నమోదు చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ధాన్యం కేటాయింపులు చేసే ముందు  ఆయా మిల్లుల మిల్లింగ్​ సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయింపుల్లో 10 శాతం విలువైన బ్యాంక్ గ్యారెంటీ తప్పనిసరి సమర్పించాలని  ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ చాలా మంది మిల్లర్లు ఆ నిబంధనను సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకోవడంలేదనే విమర్శలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,997 రైస్ మిల్లులు ఉండగా, అందులో పావువంతు కూడా గ్యారెంటీలు సమర్పించకపోవడంతో ధాన్యం కేటాయింపులు ఆలస్యమవుతున్నాయి.  

కొనుగోళ్లపై ప్రభావం..

రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, మిల్లర్ల గ్యారెంటీ జాప్యం కారణంగా కొనుగోళ్లు ఆశించిన వేగం పుంజుకోవడంలేదు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కోతలు పూర్తై.. సెంట్లరకు రైతులు వడ్లు తెస్తుండగా, ధాన్యం తరలింపు, మిల్లులకు ధాన్యం కేటాయింపు ప్రక్రియ పూర్తి కాలేదు. తేమ శాతం తగ్గించేందుకు రైతులు రోజంతా వడ్లు ఆరబెడుతున్నా.. కొనుగోలు ప్రారంభం అయినా.. వాటిని మిల్లులకు తరలించే ప్రక్రియ పుంజుకోక పోవడం  ఇబ్బందిగా మారింది. మిల్లర్లు మాత్రం తమకు రావాల్సిన మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్, డ్రైయింగ్, మెయింటెనెన్స్, బ్లెండింగ్ చార్జీలులాంటి బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వడం కష్టమవుతున్నదని వాదిస్తున్నారు. బకాయిలను గ్యారెంటీగా పరిగణించాలని డిమాండ్​ చేస్తున్నారు.  కొందరు మిల్లర్లు గతంలో కూడా గ్యారెంటీలు ఇవ్వకపోయినా సులువుగా తప్పించుకున్నందున, ఈసారి కూడా అలాగే వ్యవహరించాలనే యత్నంలో ఉన్నారని సమాచారం.

కొనుగోళ్ల టార్గెట్​ 80 లక్షల టన్నులు 

రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో 67 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు 148.03 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్టు అంచనా. సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమైంది. అందులో సన్న వడ్లు 40 లక్షల టన్నులు, దొడ్డు వడ్లు 40 లక్షల టన్నులు ఉన్నాయి. ఇందుకోసం 8,342 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్రాల్లో ధాన్యం తేమ 17 శాతం మించకుండా ఉండాలనే నిబంధనతో రైతులు పొద్దంతా వడ్లు ఆరబెట్టి, సాయంత్రం రాశులు చేసి పట్టాలు కప్పుతున్నారు. అయినా మిల్లర్ల మొండితనం వల్ల తరలింపు ఆలస్యమవుతున్నది. ప్రభుత్వం ఈ సీజన్‌‌‌‌‌‌‌‌కు గ్రేడ్ ‘ఏ’ వరికి క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించింది  సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తున్నది.  మొత్తం రూ.23 వేల కోట్ల విలువైన కొనుగోళ్లు జరపాలని లక్ష్యం పెట్టుకున్నది. అయితే, మిల్లర్లతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల మిల్లర్లు, ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో కొనుగోళ్లు వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 గ్యారెంటీ ఇస్తేనే ధాన్యం కేటాయింపులు..

 ‘డిఫాల్టర్’ మిల్లర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం ఇవ్వబోమని అధికార యంత్రాంగం ఇప్పటికే హెచ్చరించింది. ప్రతి మిల్లు కనీసం 50 శాతం ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లింగ్ చేయాల్సిన బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. బ్యాంక్​ గ్యారెంటీలు లేట్​ అయితే.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్​సీఐ)కు సీఎంఆర్ సరఫరాలో జాప్యం, సెంటర్లలో ధాన్యం నిల్వలు పెరగడం, కొనుగోలు చక్రం దెబ్బతినడం, రైతులకు చెల్లింపులు ఆలస్యం కావడంలాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారుల వర్గాలు చెబుతున్నాయి.   ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని, గ్యారెంటీలు సమర్పించని మిల్లులను బ్లాక్‌‌‌‌‌‌‌‌లిస్ట్ చేసి, కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.