
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఎంపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంక, రాహుల్ భుజం..భుజం కలిసి నడుస్తున్న ఫొటోలను కాంగ్రెస్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.
భారత్ జోడోయాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని బోదర్లి గ్రామానికి చేరుకున్నారు. ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన రాహుల్ దేశంలో వ్యాప్తి చెందుతున్న విద్వేషం, హింస, భయాందోళనలకు వ్యతిరేకంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కన్యాకుమారి నుంచి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో తీసుకుని భారత్ జోడో యాత్రను ప్రారంభించానని..ఈ మువ్వెనెల జెండాను శ్రీనగర్ కు చేరుకోకుండా ఎవరూ ఆపలేరన్నారు. ఈ యాత్రలో సీనియర్ నేతలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ యాత్రకు కౌంటర్ గా మధ్యప్రదేశ్ లో కొన్ని గంటల ముందు బీజేపీ ర్యాలీ నిర్వహించింది. గిరిజనుల ఐకాన్ తాంత్యాభీల్ జన్మస్థలం ఖాండ్వాలో బీజేపీ జంజాతీయ గౌరవ్ యాత్ర ప్రారంభించింది. ఈ ర్యాలీకి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, నలుగురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడుతూ తాంత్యాభీల్ చనిపోయారు. ఇండోర్ లోని పాతాల్పానీలో డిసెంబర్ 4న బీజేపీ ర్యాలీ ముగుస్తుంది. అదే రోజు కాంగ్రెస్ ర్యాలీ మధ్యప్రదేశ్‌లోని ఆరు జిల్లాలను కవర్ చేసిన తర్వాత రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది.