- బల్క్ అప్లికేషన్లు సమర్పిస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: ముస్లిం ఓటర్ల పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా బల్క్ అప్లికేషన్ల ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ గోషామహల్‌లోని బూత్ నంబర్ 28, 30, 127లో ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించేందుకు ముందుగానే ప్రింట్ చేసిన ఫారం-7 దరఖాస్తులను సమర్పిస్తున్నారని ఆరోపించారు. ఈ ఓటర్లందరి పేర్లు 2002 నుంచి జాబితాలో ఉన్నాయని స్పష్టం చేశారు.
ఒకే వ్యక్తి 122 అప్లికేషన్లు ఎలా సమర్పిస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఈ కుట్ర వెనుక బీజేపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. బల్క్‌గా, తప్పుడు ఫారం-7 దరఖాస్తులు దాఖలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు
