హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ పథకాలకు కోత పడుతోందని మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో మజ్లిస్ చారిటీస్ ఎడ్యుకేషనల్ అండ్ రిలీఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘ఆల్ ఇన్ వన్’ స్టడీ మెటీరియల్‌ను అసదుద్దీన్ పంపిణీ చేశారు. నగరంలోని 1,700 మంది ఉర్దూ మీడియం పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, విద్యా సాయాన్ని తగ్గించారని, కొన్ని పథకాలను నిలిపివేశారని అన్నారు. దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఈ ఏడాది తెలంగాణవ్యాప్తంగా 8 వేల కిట్లు పంపిణీ చేస్తుండగా, జులైలో 11 వేల కిట్లు అందించామని, మొత్తం రూ.65 లక్షలు ఖర్చు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఎస్‌ఐఆర్‌లో నోటీసులు అందుకున్న ఓటర్లు గడువులోగా స్పందించి పత్రాలు సమర్పించాలని అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. జాబితాలో పేర్లు తొలగించినా, ‘షిఫ్టెడ్’, ‘డెత్’గా గుర్తించినా ఈసీ సూచించిన విధానంలో చర్యలు తీసుకోవాలని కోరారు.
