- అన్ని స్థానాల్లోనూబరిలోకి దిగుతం: అసదుద్దీన్
- టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పార్టీ నాయకులకు సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఉనికిని చాటాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో మీడియాతో ఒవైసీ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో అన్ని చోట్లా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
టికెట్ల కోసం పార్టీ నాయకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తుల సేకరణపై జిల్లా స్థాయి నేతలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. దరఖాస్తులకు ఐదు రోజులు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ‘‘మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏఐఎంఐఎం అధికారిక ఫేస్‌బుక్ పేజీ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానితో పాటు పార్టీ పేరుతో రూ.3వేల డీడీ తీసి.. వాటిని పార్టీ జిల్లా టౌన్ ప్రెసిడెంట్‌కు అందించాలి. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తులను టౌన్ అధ్యక్షులు హైదరాబాద్‌కు పంపిస్తారు.
వాటిని పరిశీలించి అభ్యర్థులను ప్రకటిస్తాం” అని వివరించారు. ‘‘ఇటీవల మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ ఘన విజయాలు సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 125 స్థానాల్లో గెలిచాం. ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 33 సీట్లు, మాలెగావ్‌లో -21 స్థానాలు దక్కించుకున్నాం. 2015లో శంభాజీనగర్‌లో 24 సీట్లు గెలుచుకున్నాం. ఈసారి ఆ సంఖ్యను పెంచుకున్నాం. ఈ ఫలితాలు మా పార్టీ కేవలం ఒక వర్గానికి పరిమితమైనది కాదని నిరూపించాయి. ఎస్సీ, ఎస్టీలు సహా హిందువులు కూడా మా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు” అని పేర్కొన్నారు.
