- సీమాంచల్ అభివృద్ధికి కృషి చేస్తాం: అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్, వెలుగు: ముస్లిం మైనార్టీలు కేవలం ఓటర్లుగా మారొద్దని, మంచి పౌరులుగా ఎదగాలని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రజల స్పష్టమైన తీర్పుగా అంగీకరిస్తున్నం. ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లకు అభినందనలు. నితీశ్ కుమార్‌తో కలిసి బిహార్‌లోని సీమాంచల్ ప్రాంత అభివృద్ధికి సహకారం అందిస్తాం. అక్కడ బాలల మరణాల రేటు తగ్గించడం, పాఠశాలలు, హాస్పిటళ్లు నిర్మించడంపై దృష్టిపెడ్తాం.
గతంలో సీమాంచల్‌లో 5 స్థానాల్లో గెలిచినం. వాళ్లు వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. అయినా.. మేము సీమాంచల్‌ను వదులుకోలేదు’’ అని అసదుద్దీన్ అన్నారు. ‘‘జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు’’అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని ముందే చెప్పానని స్పష్టం చేశారు. 2023 తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి లీడర్ షిప్ గ్రాఫ్ పెరుగుతూ వస్తున్నదని తెలిపారు.
