నెట్వర్క్, వెలుగు : తమ సమస్యలను వెంటనే పరిష్కరించి, కనీస వేతనం రూ.18 వేలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు కలెక్టరేట్లను ముట్టడించారు. వనపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేయగా, నాగర్ కర్నూల్‌లో రెండో రోజు సమ్మెలో భాగంగా అధికారులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న ఆశాలను పోలీసులు అరెస్టు చేశారు.
గద్వాలలో కలెక్టరేట్ ముట్టడితో పాటు వంటా-వార్పుతో నిరసన వ్యక్తం చేయగా, నారాయణపేటలో మండుటెండను సైతం లెక్కచేయకుండా కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా వర్కర్లకు ఫిక్స్ డ్ వేతనం కేటాయించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
