
ఆషాఢమాసం కొనసాగుతుంది. ఇప్పటికే గోల్కొండలో బోనాలు ముగిసాయి. మహిళలు సందడే సందడి చేస్తున్నారు. చేతులను ఎర్రగా పండించుకొనేందుకు తాపత్రయ పడుతున్నారు. ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. గతంలో మైదాకు కోసం జనాలు ఎగపడేవారు.. ఇప్పుడు కోన్ ల సంస్కృతి వచ్చిందనుకోండి.... అసలు ఆషాఢానికి గోరింటాకుకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. . .!
గోరింటా పూచింది...కొమ్మా లేకుండా.. మురిపాల అరచేత మొగ్గా తొడిగింది.. ఎంచక్కా పండేనా.. ఎర్రన్ని చుక్క.. చిట్టీ పేరంటానికి శ్రీరామ రక్ష.." గోరింటాకు సినిమాలో పాట ఇది. మైదాకు అంటే అడపిల్లలకు ఎంతో ఇష్టం. పెళ్లైనా.. పేరంటం అయినా చేతులకు మైదాకు ఉండాల్సిందే. తెల్లారి లేచి... ఎర్రగా పండిన చేతులను అందరికీ చూపించి మురిసిపోవాల్సిందే.
ఆషాఢం వచ్చిందంటే చాలు... ఆడవాళ్ల చేతులు మైదాకు(గోరింటాకు)తో చూడముచ్చటగా కనిపిస్తాయి. ఆషాఢం నెలలో ఒక్కసారైనా మైదాకు పెట్టుకోవాలని పెద్దలు అంటారు. అంతేకాదు బాగా పండితే మంచి భర్త దొరుకుతాడు అని పెద్దలు చెప్తారు.
కానీ.. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పటివాళ్లకూ చేతుల్లో, కాళ్ల మీదా మైదాకును పండించడం ఇష్టమే అయినా.. కోయడం, నూరడం, పెట్టుకో వడం కాస్త కష్టం. అందుకే కోన్ లనే ఎక్కువగా వాడుతున్నారు. చాలా మందికి మైదాకు విశిష్టత తెలియదు. దీనిలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పటి తరం అమ్మాయిలకు చెప్పాలని చాలా పట్టణాల్లో ఆషాఢంలో మైదాకు పండుగలు చేస్తున్నారు.
ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే... బాగా వర్షాలు పడడంతో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. వర్షంతో స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. గ్రామాల్లో ఉండే ఆడవాళ్లు ఆషాఢ మాసంలో ఉదయం లేచింది మొదలు పొలాల్లోనే ఉంటారు. నారుమళ్లలో పని చేసేటప్పు డు ఎక్కువసేపు బురదలోనే ఉండాల్సి ఉంటుంది. అలాంటి టైంలో బురద వల్ల కాళ్ల గోళ్లు దెబ్బతింటాయి. స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. కాళ్లు ఎక్కువ సేపు నీళ్లలో నానడం వల్ల మంటలు పుడతాయి. మైదాకు పెట్టుకోవడం. వల్ల ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.
ఆయుర్వేదంలో కూడా..
మైదాకు మంచి మెడిసిన్ అని ఆయుర్వేదం లో చెప్పారు. ఆకుల్లో మాత్రమే కాకుండా పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు, గింజల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. మైదాకు చెట్ల పూలు సువాసన వెదజల్లుతాయి. అందుకే వాటిని అత్తరు తయారీలో ఎక్కు వగా వాడతారు. సూరిన మైదాకులో కాస్త నిమ్మరసం కలిపి అరికాళ్లకు పెట్టుకుంటే మంటలు, నొప్పులు తగ్గుతాయి. మైదాకు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అందుకే ఆషాఢంలోనే కాదు అన్ని శుభకార్యాలప్పుడూ మైదాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తుంటారు. అరచేతులకు మైదాకు పెట్టుకుంటే శరీరం లోని వేడిని నియంత్రిస్తుంది.
కోన్లు ఓకేనా?
ఆషాఢంలో మైదాకు పెట్టుకొమ్మన్నారు కదా అని చెప్పి కొందరు ఆర్టిఫిషియల్ తయారు చేసిన మెహిందీ (కోన్లు) వాడతారు. మైదాకు అనగానే నేటి తరం ఆడపిల్లలు చాలా మందికి గుర్తుకొచ్చేది కోన్స్.. ఆర్టిఫిషియల్ కలర్స్ మాత్రమే. ఆ రంగుల మాయలో పడి మైదాకును మరిచిపోతున్నారు
ఒక్కోసారి అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మైదాకు నూరి పెట్టుకోవడమే మంచిది. కొన్ని రకాల కోన్లలో రంగు కోసం రసాయనాలు కలుపుతారు. దీని వల్ల చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది.