మహారాష్ట్రలోనూ.. బజరంగ్ దళ్​ను బ్యాన్ చేయాలె: అశోక్ చౌహాన్

మహారాష్ట్రలోనూ.. బజరంగ్ దళ్​ను బ్యాన్ చేయాలె: అశోక్ చౌహాన్

ముంబై: కర్నాటకలో బజరంగ్ దళ్ బ్యాన్ అనేది మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతానికి కూడా వర్తిస్తుందని మాజీ సీఎం అశోక్ చౌహాన్ అన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతామని బీజేపీ కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. బజరంగ్​దళ్​ను బ్యాన్ చేస్తామన్న కర్నాటక కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ లీడర్ల విమర్శలను ఖండించారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో అశోక్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు. కర్నాటక ప్రభుత్వం బజరంగ్‌‌దళ్‌‌కు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదిక ఇస్తే.. మహారాష్ట్ర కూడా ఇస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మతపరమైన దాడులు, టెర్రరిజాన్ని అరికట్టేందుకు సెపరేట్ పోలీస్ వింగ్ ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. బజరంగ్​దళ్​ను బ్యాన్​ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. బీజేపీ ప్రకటించిన సెపరేట్ పోలీస్ వింగ్ ఏం పని చేస్తుందో వాళ్లనే అడగండి”అంటూ చౌహాన్ అన్నారు. 

రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తాం

‘‘మేము చట్టంతో పాటు రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. వీటిని ఎవరు ఉల్లంఘించినా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. వ్యక్తులైనా, సంస్థలైనా శిక్షకు అర్హులు. బజరంగ్​దళ్, పీఎఫ్ఐలాంటి ఎన్ని ఆర్గనైజేషన్స్​ అయినా చట్టప్రకారం ముందుకు పోవాల్సిందే. లేదంటే బ్యాన్ విధిస్తామన్న కామెంట్స్​లో తప్పేం లేదు. మెజార్టీ, మైనార్టీ వర్గాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నా” అని అశోక్​ చౌహాన్​ అన్నారు. మహారాష్ట్రలో కూడా బజరంగ్​దళ్ బ్యాన్​ విధించాలని డిమాండ్​ చేశారు. స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపించాలన్నారు. అయినా, అంతిమంగా నిర్ణయం తీసుకునే బాధ్యత కేంద్రానికే ఉంటుందని తెలిపారు. ‘‘ఎన్​సీపీకి జాతీయ హోదా రావాలంటే కొన్ని ఓట్లు చాలు. ఆ పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాలు బీజేపీకి బెనిఫిట్​గా ఉండొద్దు. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిల్చుంటే ఓట్లు చీలుతాయి” అని అన్నారు. ఎన్నికల టైంలోనే హనుమాన్ చాలీసా పఠించడం ఆమోదయోగ్యం కాదని చౌహాన్​ అన్నారు.