IND vs ENG: పోరాడుతున్న ఇంగ్లాండ్.. ఆసక్తికరంగా వైజాగ్ టెస్ట్

IND vs ENG: పోరాడుతున్న ఇంగ్లాండ్.. ఆసక్తికరంగా వైజాగ్ టెస్ట్

వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్ ధీటుగా ఆడుతుంది. 399 పరుగుల లక్ష్య ఛేదనలో పోరాడుతున్నారు. భారీ లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజ్ లో జాక్ క్రాలి(29), నైట్ వాచ్ మ్యాన్ రెహన్ అహ్మద్(9) ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే మరో 332 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. నాలుగో రోజు పిచ్ స్పిన్నర్లకు అనూకూలిస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం దాదాపు ఖాయంగా కనబడుతుంది. 

భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు క్రాలి, బెన్ డకెట్ ఆ జట్టుకు ఎప్పటిలాగే శుభారంభాన్ని ఇచ్చారు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను 50 పరుగులు దాటించారు. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ లను టార్గెట్ చేస్తూ బౌండరీల వర్షం కురిపించారు.   ప్రమాదకరంగా మారుతున్న వీరి భాగస్వామ్యానికి అశ్విన్ బ్రేక్ వేశాడు. స్వీప్ షాట్ ఆడటానికి ప్రయతించిన డకెట్ 28 పరుగులు చేసి  వికెట్ కీపర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో రెహన్ అహ్మద్ తో కలిసి క్రాలి, రెహన్ అహ్మద్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 

ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 143 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. యువ బ్యాటర్ శుభమాన్ గిల్ 104 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209) చేయడంతో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ బుమ్రా దెబ్బకు 253 పరుగులకే ఆలౌటైంది. క్రాలి 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.