
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలు ఇంటర్నేషనల్ క్రికెట్ క్యాలెండర్‌ను దెబ్బతీయనున్నాయా? బంగ్లాదేశ్‌తో టీమిండియా సిరీస్‌కు కూడా ఇది అడ్డంకిగా మారబోతున్నదా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ టూర్ జరగడం అనుమానంగానే మారింది. పాక్‌పై ఇండియా యుద్ధం చేస్తే భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి చాలా దగ్గరగా పని చేస్తున్న రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఫజ్లూర్ రెహమాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
దీనికిగాను చైనాతో కలిసి ఉమ్మడి సైనిక చర్యను చేపట్టాలని పిలుపు ఇవ్వడం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. దీంతో బంగ్లా టూర్ సందిగ్ధంలో పడింది. ఇక పహల్గాం ఉగ్రదాడి ఒక్క బంగ్లా టూర్‌ను మాత్రమే కాదు.. 2025 ఆసియా కప్ (సెప్టెంబర్) కూడా డైలమాలో పడేసింది. ఇండియా కఠిన చర్యలకు సిద్ధమవుతుండటంతో సమీప భవిష్యత్‌లో పొరుగు దేశాలతో క్రికెట్ ఆడటం దాదాపు ఆసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇండియా వీటిని బహిష్కరిస్తే ఇంటర్నేషనల్ క్యాలెండర్ మొత్తం అస్తవ్యస్తం అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆసియా కప్ విలువ మొత్తం ఇండియా, పాక్ మ్యాచ్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించినా ఇండో–పాక్ మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.