
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో నాలుగోసారి విజేతగా నిలిచేందుకు ఇండియా మరొక్క అడుగు దూరంలో నిలిచింది. సొంతగడ్డపై జరుగుతున్న మెగా టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తూ ఐదో సారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన ఇండియా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 5–0తో జపాన్‌ను చిత్తు చేసింది. ఆకాశ్‌దీప్ సింగ్ (19వ నిమిషం), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (23వ ని), మన్‌దీప్ సింగ్ (30వ ని), సుమిత్ (39వ ని), సెల్వమ్ కార్తి (51వ ని) తలో గోల్‌తో టీమ్‌ను గెలిపించారు. ఇండియా డిఫెండర్లు, ముఖ్యంగా కెరీర్‌లో 300వ మ్యాచ్ ఆడిన గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అడ్డు గోడగా నిలవడంతో జపాన్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. మన్‌ప్రీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మలేసియాతో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీఫైనల్లో మలేసియా 6–2తో కొరియాను ఓడించి తొలిసారి ఫైనల్‌కు వచ్చింది.
గోల్స్ మోత
మెగా టోర్నీలో మూడుసార్లు చాంపియన్ అయిన ఇండియా బలమైన జపాన్‌పై హైక్లాస్ ఆట చూపెట్టింది. స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి డిఫెన్స్‌కు సవాల్ విసిరింది. జపాన్ గోల్ పోస్ట్‌పై ముమ్మరంగా దాడులు చేసింది. అయితే, తొలి క్వార్టర్‌లో జపాన్ తమ డిఫెన్స్‌లో ఆతిథ్య జట్టు దాడులను బాగానే అడ్డుకుంది. పెనాల్టీ కార్నర్ రూపంలో ఇండియాకు తొలి అవకాశం లభించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ షాట్‌ను జపాన్ గోల్‌కీపర్ తకాషి యోషికావా సేవ్ చేశాడు. బంతిని ఎక్కువగా తమ ఆధీనంలో ఉంచుకున్న ఇండియాను అందుకునేందుకు జపాన్ అనేక ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఫస్ట్ క్వార్టర్ గోల్ లేకుండా ముగియగా.. రెండో క్వార్టర్‌లో ఇండియా జోరు పెంచింది. ఈ క్రమంలో 19వ నిమిషంలో హార్దిక్ సింగ్ షాట్‌ను జపాన్ కీపర్ సేవ్ చేయగా రీబౌండ్ అయిన బాల్‌ను ఆకాశ్‌దీప్ సింగ్ నెట్‌లోకి కొట్టడంతో ఆతిథ్య జట్టు ఖాతా తెరిచింది. నాలుగు నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్ లో ఫ్లిక్‌తో గోల్ చేశాడు.
సెకండాఫ్ ముగుస్తుందనగా మన్‌ప్రీత్ సహకారంతో మన్‌దీప్ ఫీల్డ్ గోల్చేశాడు. మిడ్ ఫీల్డ్‌లో బాల్‌ను అందుకున్న మన్‌ప్రీత్ సింగ్ ముగ్గురు జపాన్ డిఫెండర్లను తప్పిస్తూ అందించిన బాల్‌ను మన్‌దీప్ నెట్‌లోకి పంపించాడు. దాంతో 3–0తో స్పష్టమైన ఆధిక్యంతో ఇండియా ఫస్టాఫ్‌ను ముగించింది. సెకండాఫ్‌లోనూ హోమ్ టీమ్ దాడులను కొనసాగించింది. ఈ క్రమంలో మన్‌ప్రీత్ రైట్ ఫ్లాంక్ నుంచి అందించిన బాల్‌ను సుమిత్ బ్యాక్ స్టిక్ ఫ్లిక్‌తో గోల్ చేయడంతో ఆధిక్యం 4–0కి పెరిగింది. ఆపై, 51వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ ఇచ్చిన ఏరియల్ పాస్‌ను సుఖ్‌జీత్ నుంచి అందుకున్న యంగ్‌స్టర్ సెల్వమ్ ఇండియాకు ఐదో గోల్ అందించాడు. మరోవైపు జపాన్ ఎంత ప్రయత్నించినా ఒక్క గోల్ కూడా చేయకుండా చిత్తుగా ఓడిపోయింది.