- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రెండు రజతాలు
- రుద్రాన్ష్ పాటిల్‌కు బ్రాంజ్ టీమ్ విభాగంలో సిల్వర్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో కాంస్యం
ఆసియా క్రీడల్లో ఇండియా షూటర్ల గురి మళ్లీ అదిరింది. సోమవారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మూడు పతకాలు సాధించారు. వ్యక్తిగత విభాగంలో హిమాన్షు దిల్లాన్, రుద్రాంక్ష్ పాటిల్ వరుసగా సిల్వర్, బ్రాంజ్ గెలవగా, టీమ్ విభాగంలో ఈ ఇద్దరితో పాటు పార్థ్ మానేకు సిల్వర్ మెడల్ లభించింది. మెగా గేమ్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచిక తరియల్ కాంస్యంతో చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఇండియా ఖాతాలో ఆరు పతకాలు చేరాయి.
నాగోయా: ఆసియా క్రీడల్లో ఇండియా షూటర్ల గురి మళ్లీ అదిరింది. సోమవారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మొత్తం మూడు పతకాలు కొల్లగొట్టారు. యంగ్ షూటర్ హిమాన్ష్ దిల్లాన్ రెండు రజతాలు సాధించాడు. హోరాహోరీగా సాగిన 10 మీటర్ల రైఫిల్ వ్యక్తిగత ఫైనల్లో దిల్లాన్ 252.4 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచాడు. ఇండియాకే చెందిన రుద్రాన్ష్ పాటిల్ 230.9 పాయింట్లతో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. చైనీస్ షూటర్ లిహవో షెంగ్ (254.2) ఆసియా రికార్డుతో స్వర్ణం నెగ్గాడు. ఆరంభంలో అద్భుతమైన గురితో ఆకట్టుకున్న రుద్రాన్ష్ రెండో సిరీస్ ముగిసేసరికి 106.0 పాయింట్లతో చైనీస్ షూటర్ కంటే 1.1 పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు. హిమాన్ష్ 104.8 పాయింట్లతో వెనకబడి ఉన్నాడు.
అయితే ఎలిమినేషన్ సిరీస్‌లో ఆట గమనం పూర్తిగా మారింది. 24 షాట్ల ఫైనల్లో రుద్రాన్ష్ 9.7 పాయింట్లతో తడబడగా, హిమాన్ష్ 10.6 పాయింట్లతో రెండో ప్లేస్‌కు చేరాడు. క్వాలిఫికేషన్లో రుద్రాన్ష్ 631.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, హిమాన్ష్ 630.0 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పార్థ్ మానే 628.3 పాయింట్లతో ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో హిమాన్ష్–రుద్రాన్ష్–పార్థ్ త్రయం మొత్తం 1890.1 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. చైనాకు చెందిన లిహవో షెంగ్–చాంగ్‌హాంగ్ జాంగ్–సిహాన్ మా త్రయం 1899.0 పాయింట్లతో స్వర్ణం గెలిచారు. గతేడాది కైరోలో నెలకొల్పిన తమ 1898.4 పాయింట్ల వరల్డ్ రికార్డును సవరించారు. 1884.2 పాయింట్లతో సౌత్ కొరియా బ్రాంజ్ మెడల్‌ను సాధించింది. ఓవరాల్‌గా ఇండియా 6 మెడల్స్‌తో 12వ స్థానంలో ఉంది.
సుచికకు కాంస్యం
తొలిసారి ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో ఇండియాకు పతకం లభించింది. మహిళల సాంప్రదాయ 60 కేజీల కేటగిరీలో సుచిక తరియల్ కాంస్యం దక్కించుకుంది. హుయ్ హూన్ టియో (సింగపూర్)తో జరిగిన సెమీస్‌లో సుచిక అద్భుతంగా పోరాడినా ఓటమి తప్పలేదు. నిర్ణీత రౌండ్లు ముగిసేసరికి ఇద్దరి స్కోర్లు సమమైనా.. టియో మెరుగ్గా ఆడిందని ముగ్గురు రిఫరీలు భావించారు. దీంతో ఆమెను విజేతగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ ఫలితంపై ఇండియా టీమ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో 10 మంది అధికారులు రివ్యూ చేసి డ్రాగా ప్రకటించారు.
ఇక్కడ కూడా సుచికకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ డ్రా కావడంతో ఆసియా రూల్స్ ప్రకారం ‘బరువు’ను ప్రామాణికంగా తీసుకున్నారు. ఫలితంగా టియోను విజేతగా ప్రకటించారు. పోటీలకు ముందు ఉదయం అథ్లెట్ల బరువును చెక్ చేసినప్పుడు సుచిక కంటే టియో 700 గ్రాములు తక్కువగా ఉండటంతో ఆమె ఫైనల్‌కు చేరింది. సెమీస్ ఓటమితో సుచిక కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఫైనల్ చేరితే కనీసం రజతమైనా దక్కేది. హర్యానా రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల సుచికకు జూడో, కురాష్, జియు-జిట్సు విభాగాల్లో మంచి పట్టుంది. దాంతో ఏషియన్ గేమ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో ఇండియాకు పతకం తెచ్చిన తొలి అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
క్వార్టర్స్‌లో ఇండియా
ఇచినోమియా: బ్యాడ్మింటన్‌లో ఇండియా మెన్స్ టీమ్ అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3–0తో గెలిచి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. సింగిల్స్ మ్యాచ్‌ల్లో లక్ష్యసేన్ 21–4, 21–12తో అమన్ జమాన్‌పై గెలవగా, తర్వాతి మ్యా చ్ల్లో ఆయుష్ శెట్టి 21–4, 21–13తో గౌరభ్ సింగ్‌పై, శ్రీకాంత్ 21–15, 21–9తో జుమర్ అల్ అమన్‌పై గెలిచారు. ఈ విజయంతో డబుల్స్ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం రాలేదు. విమెన్స్ జట్టు కూడా క్వార్టర్స్‌లో జపాన్‌తోనే పోటీపడనుంది. టేబుల్ టెన్నిస్‌లో ఇండియా మెన్స్, విమెన్స్ జట్లు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాయి. పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇండియా టీమ్స్ 3–0 తేడాతో విజయం సాధించాయి. విమెన్స్‌లో సుతీర్థ ముఖర్జీ, సిండ్రెలా దాస్, శ్రీజ ఆకుల ఏకపక్ష విజయాలు నమోదు చేశారు. మెన్స్‌లో హర్మీత్ దేశాయ్, సత్యన్, పయాజ్ జైన్ రాణించారు.
కబడ్డీలో శుభారంభం
టోకై: డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన ఇండియా కబడ్డీ జట్లు.. ఆసియా క్రీడల్లో శుభారంభం చేశాయి. సోమవారం జరిగిన మెన్స్ గ్రూప్–ఎ తొలి మ్యాచ్‌లో ఇండియా 49–24తో జపాన్‌పై విజయం సాధించింది. తొలి హాఫ్‌లో 31–9 ఆధిక్యంలో నిలిచిన ఇండియా... జపాన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అటాకింగ్‌లో ఆయన్ లోచ్బ్, దేవాంక్ దలాల్ పాయింట్లతో దుమ్మురేపారు. విమెన్స్‌లో ఇండియా 42–21తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి డిఫెన్స్, రైడింగ్‌లో సత్తా చాటిన ఇండియన్లు రెండు అర్ధభాగాల్లో కలిపి చెరో 21 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెట్టారు.
హాకీలో గోల్స్ వర్షం
కాకమిగహర: విమెన్స్ హాకీలో ఇండియా ప్లేయర్లు గోల్స్ వర్షం కురిపించారు. సోమవారం జరిగిన పూల్–బి మ్యాచ్‌లో ఇండియా 17–1తో ఇండోనేసియాను చిత్తుగా ఓడించింది. యువ ఫార్వర్డ్స్ దీపిక సెహ్రావత్ (8, 28, 40వ నిమిషాలు), రుతుజా దాదాసో పిసల్ (15, 20, 38వ నిమిషాలు), నవనీత్ కౌర్ (35, 56, 57వ నిమిషాలు) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగారు. సునెలితా టొప్పో, లాల్రెమ్సియామి, సాక్షి రాణా చెరో రెండు గోల్స్ చేయగా, కెప్టెన్ సలీమా టెటే, ఇషికా చౌదరి చెరో గోల్ సాధించారు. ఇన్నెస్ అడితియా ఇండోనేసియాకు ఏకైక గోల్ అందించింది. ఈ మ్యాచ్ ద్వారా ఇండియా స్టార్ గోల్‌కీపర్ సవితా పునియా అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మహిళా హాకీ ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.
