ధరణి సమస్యలు వారంలోపు క్లియర్ చేస్తం : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ధరణి సమస్యలు వారంలోపు క్లియర్ చేస్తం : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూ లో ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • పోడు సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే చేస్తం
  • విపత్తు నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక
  • పారిశుధ్య సమస్య రాకుండా ప్రత్యేక డ్రైవ్ చేపడతాం

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో ఈ వానాకాలం సీజన్​లో ప్రజలు, రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అన్ని రంగాల్లో పురోగతి సాధించి ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలుచేసేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కుమ్రం భీం ఆసిఫాబాద్​జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ‘‘వెలుగు’’తో ఆయన మాట్లాడారు.  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుస్తామని.. ధరణి, పోడు సమస్యలు మొదలు విపత్తు, సీజనల్ వ్యాధులను పకడ్బందీగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్ మాట్లాడారు.

వారం రోజుల్లో వంద శాతం

ధరణి సమస్యలకు ప్రభుత్వం నిర్దిష్ట డెడ్​లైన్ విధించింది. ఆ దిశగా జిల్లాలోని భూ సమస్యలన్నీ వారం రోజుల్లోగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నం. ఇప్పటికే ఈ అంశంపై అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లకు ప్రత్యేక మీటింగ్ నిర్వహించి ఆదేశాలిచ్చాం. వారంలోపు వంద శాతం సమస్యలు క్లియర్ చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నం.

అందరి సమ్మతంతో పోడు సమస్య పరిష్కరిస్తం

పోడు సమస్య పరిష్కారానికి జాయింట్ సర్వే కీలకం. జిల్లాలో అడవి ఎక్కువగా ఉండడంతో పోడు సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నం. ఇటీవల ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటుతుండడంతో సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించేందుకు ఫారెస్ట్, రెవెన్యూ శాఖల జాయింట్ సర్వే చేయిస్తున్నం. సమస్య ఉన్న భూమికి సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకుని వాస్తవంగా ఎవరు అనుభవిస్తున్నారు? ఎప్పటి నుంచి అనుభవిస్తున్నారనేది తేల్చుతున్నం. ఇప్పటికే రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులకు జాయింట్ సర్వేపై ఆదేశాలు ఇచ్చాం. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు పెట్టి వాస్తవ విషయాలు వివరించి అందరి సమ్మతంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నం.

వరద నష్టాన్ని అరికట్టేందుకు ముందస్తు ప్రణాళిక

వరదలతో జరిగే నష్టాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. గతంలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభావిత ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నం. ఎస్​డీఆర్ఎఫ్ ,ఫైర్ సిబ్బంది, పంచాయతీ, మత్స్య శాఖను అలర్ట్​గా ఉంచుతున్నాం. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. గర్భిణులకు సమయానికి వైద్యం అందడం కీలకం. వాగులపై వంతెనలు లేక వరదల కారణంగా అంబులెన్స్ వెళ్లలేక ప్రాంతాల్లో ఉన్న గర్భిణులను, హై రిస్క్ కేసులను గుర్తించి సమీపంలోని పీహెచ్​సీ, సీహెచ్ సీలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నం.

ఎరువులు, విత్తనాలకు కొరత లేదు

జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదు. విత్తనాల అమ్మకంపై ప్రత్యేక ప్రత్యేక దృష్టి పెట్టాం. ఫర్టిలైజర్ షాపుల్లో ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. నాతో పాటు అడిషనల్ కలెక్టర్, డీఏఓ, ఆర్డీవో తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఫిర్యాదును పూర్తిగా పరిశీలిస్తున్నాం. విత్తనాలు కొన్న రైతులకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నం. ఎక్కడ కొన్నరు. ఎంతకు కొన్నరు అనేది తెలుసుకుంటున్నాం. ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు కఠినంగా ఉంటాయి.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. సీజనల్ వ్యాధులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ పంచాయతీ, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రెవ్​లు నిర్వహించి శానిటేషన్ సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే ఓసారి స్పెషల్ డ్రెవ్ చేపట్టాం. వచ్చే వారం మరోసారి నిర్వహిస్తాం. గతేడాది వర్షాలకు కోతకు గురైన రోడ్లు, వంతెనలను స్థానంలో ములుగు జిల్లా తరహాలో ఐరన్ బ్రిడ్జిలు నిర్మించేందుకు సర్వే జరిపిస్తున్నాం.

సీజనల్​ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉన్నాం

జిల్లా వైద్య శాఖలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు పోస్టుల భర్తీ కోసం గవర్నమెంట్​కు నివేదిక పంపించాం. మంత్రి సీతక్క సైతం ఇటీవల రివ్యూ నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ విషయంలో అలర్ట్​గా ఉన్నాం. ఒక్క కేసు నమోదైనా వెంటనే చుట్టుపక్కల 50 ఇండ్లలో శాంపిల్ సర్వే చేయించి వ్యాధి వ్యాప్తి కాకుండా తక్షిణ చర్యలు తీసుకుంటాం. సీజనల్​ వ్యాధుల వైద్య సిబ్బందిని ఇప్పటికే అలర్ట్ చేశాం. హాస్పిటళ్లలో మందుల కొరత లేదు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథ సర్వే చేపడుతున్నాం. ఈ సర్వేను మరో నాలుగు రోజుల్లో కంప్లీట్ చేస్తం. లీకేజీ, రిపేర్లు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.