పెండింగ్​ బిల్లులు చెల్లించకుంటే పల్లె ప్రగతిని బహిష్కరిస్తం

పెండింగ్​ బిల్లులు చెల్లించకుంటే పల్లె ప్రగతిని బహిష్కరిస్తం
  • సర్కారుకు ఆసిఫాబాద్ ​జిల్లా సర్పంచుల డెడ్​లైన్​
  • మంత్రి ఎర్రబెల్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • అవసరమైతే టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తామని ప్రకటన

ఆసిఫాబాద్, వెలుగు: వచ్చే నెల 3వ తేదీలోగా పెండింగ్​ బిల్లులు చెల్లించకుంటే పల్లె ప్రగతి బహిష్కరిస్తామని, అవసరమైతే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తామని ఆసిఫాబాద్​ జిల్లా సర్పంచులు సర్కారుకు ఆల్టిమేటం ఇచ్చారు. వచ్చే నెల 3 నుంచి ఐదో విడత పల్లె ప్రగతి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసిఫాబాద్​ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన సర్పంచులు జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్​లో శుక్రవారం సమావేశమయ్యారు. 
ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతేడాది సర్కారు చెప్పిందని, అప్పులు చేసి మరీ పల్లె ప్రగతి కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని,ఆ బిల్లులు ఇప్పటివరకూఇయ్యకపోవడంతో మిత్తిలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల వాళ్లకు మొహం చూపించలేకపోతున్నామని, కనీసం పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేక , ప్రజలకు సమాధానం చెప్పలేక  ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  
టీఆర్ఎస్ సర్పంచులు కావడం వల్లే ఇన్నాళ్లూ నోరుమూసుకొని ఉన్నామని, పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీకి రాజీనామా చేసి, ప్రభుత్వంపై పోరాడుతామన్నారు.  బిల్లులు ఇప్పించలేని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పల్లె ప్రగతికి సహకరించని సర్పంచులను, సెక్రెటరీలను సస్పెండ్ చేస్తామనడం సిగ్గుచేటన్నారు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని సర్పంచులు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్​రాజ్ ,అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు.
అప్పులపాలై ఉపాధి పనికి..

 
ఇందల్వాయి, వెలుగు: గతేడాది పల్లె ప్రగతి కోసం చేసిన అప్పులకు మిత్తి కట్టేందుకు నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలంలోని గౌరారం సర్పంచ్​ఇమ్మడి లక్ష్మి ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు. ‘‘గతేడాది ఆఫీసర్ల ఒత్తిడి మేరకు అప్పులు తెచ్చి మరీ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. కానీ ఇప్పటికీ రూ.2 లక్షల బిల్లులు రాలేదు. వాటికి నెల నెలా వడ్డీ కట్టేందుకు ఉపాధి హామీ పనికి పోతున్నా. రెండేండ్ల కింద తమ గ్రామంలోని రాకసికుంట కట్ట వర్షాలకు తెగిపోయిందని, దానికి రిపేర్​ చేయించేందుకు కూడా డబ్బుల్లేవు.  దీంతో గ్రామసభలో తీర్మానం చేసుకొని ఉపాధి హామీ కింద  చెరువు కట్టను పూడ్చుకుంటున్నాం. ఈ పనుల్లో నేను కూడా కూలీగా పాల్గొంటున్నానని” సర్పంచ్​ లక్ష్మి తెలిపారు.
సస్పెండ్​ చేస్తామనడం కరెక్ట్​కాదు

గతేడాది పల్లె ప్రగతి పెండింగ్​ బిల్లులను సర్కారు వెంటనే చెల్లించాలి. లేదంటే జూన్ 3నుంచి ప్రారంభమయ్యే ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తాం. ప్రభుత్వం చెప్పిందని లక్షల రూపాయలు అప్పుసప్పు చేసి అభివృద్ధి పనులు చేసినం. కానీ గవర్నమెంట్ బిల్లులు ఇవ్వకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నయి. పెండింగ్​ బిల్లులు ఇప్పియ్యలేని  పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పల్లె ప్రగతికి సహకరించని సర్పంచ్, సెక్రటరీ లను సస్పెండ్ చేస్తామని పేర్కొనడం కరెక్ట్ కాదు. మంత్రి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. – మడావి గుణవంత్ రావు , సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు
3 రూపాల మిత్తికి తెచ్చి పెట్టిన 

గతేడాది పల్లె ప్రగతి పనుల కోసం బయట మూడు రూపాల మిత్తికి తెచ్చిన. వాటితో అభివృద్ధి పనులు చేస్తే ఇప్పటికి రూ.16 లక్షల బిల్లులను సర్కారు పెండింగ్​ పెట్టింది. అప్పులు ఇచ్చినోళ్లు రోజూ ఫోన్​ చేసి వేధిస్తున్నరు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వస్తున్నరు. టార్గెట్​పెట్టి మరీ పనులు చేయించిన ఆఫీసర్లు ఇప్పుడు కనిపిస్తలేరు.  బిల్లులు రాకపోతే నా సొంత భూమి అమ్మి అప్పులు కట్టడం తప్ప వేరే దారి కనిపిస్తలేదు. -  కోట్నక్ కిష్టు, సర్పంచ్, పాటగుడ

 

 

 

ఇవి కూడా చదవండి

విశ్వవిఖ్యాతకు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు

ఎన్టీఆర్ ఒక ప్రభంజనం..ఒక సంచలనం

ఇంటర్​లో కొత్త కోర్సులు

దమ్ముంటే మీరు పార్లమెంట్‌ రద్దు చేయండి.. మేం అసెంబ్లీని రద్దు చేయిస్తం