వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లో కొత్త కోర్సులు

 వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లో కొత్త కోర్సులు
  • ఏఐ, సైబర్​ సెక్యూరిటీ, 
  • డేటా అనాలిసిస్​..
  • సర్కారుకు ఇంటర్ కమిషనరేట్​ ప్రపోజల్స్

హైదరాబాద్ : మారుతున్న కాలానికి అనుగుణంగా, ఇండస్ట్రీ అవసరాలు తీర్చి, ఉపాధి అవకాశాలు అందించేలా ఆరు కొత్త ఒకేషనల్ కోర్సులను ప్రారంభించాలని ఇంటర్ కమిషనరేట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సర్కారుకు పంపించింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఇంజనీరింగ్​ కోర్సులు ముందుగానే నేర్చుకునే అవకాశం ఇంటర్ స్టూడెంట్లకు లభించనుంది. ఈ కోర్సులను 2022–23 నుంచే ప్రారంభించేందుకు అధికారులు రెడీగా ఉన్నారు. రాష్ట్రంలో 2,500 వరకూ ఇంటర్​ కాలేజీలుండగా, వాటిలో 9.50 లక్షల మంది చదువుతున్నారు. ఇప్పటి వరకూ ఇంటర్‌‌‌‌‌‌‌‌ లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ కోర్సులే అందరికీ తెలుసు. ఇటీవల కొన్ని ఒకేషనల్ కోర్సులూ వచ్చాయి. అయితే 2022–23లో కొత్త కోర్సులను తీసుకురావాలని బోర్డు అధికారులు ఆలోచించారు. దీనిపై టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారి, ఇంటర్ అధికారి, మరో ముగ్గురు పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపల్స్​తో కమిటీ వేశారు. ఈ కమిటీ ఏఏ కోర్సులు ఉండాలనే దానిపై అధ్యయనం చేసి, సిలబస్ ఇతర వివరాలను ఇంటర్ కమిషనర్​ ఉమర్​ జలీల్​కు అందించారు. కొత్తగా ఆరు కోర్సులను ప్రవేశపెట్టాలని కమిటీ సూచించింది. కంప్యూటర్ సైన్స్ స్ర్టీమ్​లో మూడు, ఎలక్ట్రానిక్స్​ స్ట్రీమ్​లో మూడు కోర్సులను ప్రతిపాదించింది. కమిటీ రిపోర్టును ఇంటర్ కమిషనర్​ నెల క్రితం అప్పటి విద్యా శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు పంపించారు. దీనిపై సర్కారు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. సర్కారు కాలేజీల్లో అమలు చేసేలా దీన్ని ఫైనాన్స్ అప్రూవల్​​కు పంపించినట్టు తెలిసింది. ప్రైవేటు కాలేజీల్లోనూ ఈ కోర్సులు పెట్టుకునే అవకాశమిస్తారని తెలిసింది.

అన్నీ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సులే..
ఇంటర్​లో కొత్తగా పెట్టాలనుకునే కోర్సులన్నీ ఇంజనీరింగ్​కు సంబంధించినవే. కంప్యూటర్ సైన్స్ స్ర్టీమ్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్(ఏఐ అండ్ ఎంఎల్), సైబర్ ఫిజికల్ సిస్టమ్స్​ అండ్ సెక్యూరిటీ (సీపీఎస్), క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా ఎనలిస్టిక్స్(సీసీ అండ్ బీడీఏ) కోర్సులను ప్రతిపాదించారు. ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ కింద ఎలక్ర్టానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ టెక్నీషియన్(ఈవీఈ), బయో మెడికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ (బీఎంఈ), ఎంబెడెడ్ సిస్టమ్ టెక్నీషియన్(ఈఎస్) కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులను 2021–22లో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రారంభించారు. ఇప్పటికే ఇంజనీరింగ్​​లో ఉన్నాయి.