- అక్రమ వలసలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు
అక్రమ వలసదారులు ఆధార్ కార్డు పొందకుండా అడ్డుకునేందుకు అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన వారికి ఇకపై కొత్తగా ఆధార్ కార్డులు జారీ చేయకూడదని కేబినెట్ నిర్ణయించింది. అత్యంత అరుదైన, మినహాయింపు ఇవ్వదగ్గ కేసుల్లో మాత్రమే కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని తెలిపింది.
గువాహటి: అక్రమ వలసదారులు ఆధార్ కార్డు పొందకుండా అడ్డుకునేందుకు అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన వారికి ఇకపై కొత్తగా ఆధార్ కార్డులు జారీ చేయకూడదని కేబినెట్ నిర్ణయించింది. శనివారం సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియాతో ఈ వివరాలను పంచుకున్నారు. అత్యంత అరుదైన, మినహాయింపు ఇవ్వదగ్గ కేసుల్లో మాత్రమే దరఖాస్తుదారుడికి ఆధార్ జారీ చేసేందుకు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. ఆ ప్రతిపాదనను పరిశీలించి, సదరు దరఖాస్తుదారుడు అర్హుడో కాదో రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల జారీ ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ‘‘కొన్ని జిల్లాల్లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ 100 శాతాన్ని దాటిపోయింది. అసలు ఆదనంగా ఆధార్ కార్డులు పొందుతున్న ఈ వ్యక్తులు ఎవరు అనేది మనం కచ్చితంగా గుర్తించాల్సి ఉంది” అని సీఎం చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులు దక్కకుండా చూసేందుకే ఈ కఠినమైన చర్యలు చేపడుతున్నట్టు హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టీ తోటల కార్మిక వర్గాలు, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులకు మాత్రం ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. వీరిలో చాలా మందికి ఇంకా కార్డులు అందాల్సి ఉన్నందున ఈ మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, 2027 ఏప్రిల్ 1 వరకే ఇది అమల్లో ఉంటుందని చెప్పారు. ఆ తేదీ తర్వాత ఈ వర్గాల్లోని 18 ఏండ్లు పైబడిన వారికి కూడా ఆధార్ జారీని పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొనారు.
