రాయ్‌పూర్/భోపాల్: చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచా రం బుధవారంతో ముగిసింది. శుక్రవారం పోలింగ్ జరగనుంది. చత్తీస్‌గఢ్‌లో ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా ఇప్పటికే 20 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక, మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సార్లు చత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని సీఎం భూపేశ్ బాఘెల్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధానంగా మహదేవ్ బెట్టింగ్ యాప్, రిక్రూట్మెంట్ స్కామ్‌లపై నిలదీశారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మతో పాటు పలువురు కీలక నేతలు చత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక, కాంగ్రెస్ తరఫున పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ లీడర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం బాఘెల్ ప్రచారం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడ్తున్నదని విమర్శించారు. రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులకు దక్కాల్సిన వనరులను మోదీ తన కార్పొరేట్ ఫ్రెండ్స్‌కు అందజేశారంటూ ప్రచారం చేశారు. ఐదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం బాఘెల్ ఇటీవల ప్రకటించారు.
పెండ్లైన మహిళలకు ఏడాదికి రూ.12వేలు అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల దాకా 22 జిల్లాల్లోని 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 827 మంది పురుషులు, 130 మంది మహిళా అభ్యర్థులున్నారు. 1.63కోట్ల మంది ఓటర్ల కోసం 18,833 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
మధ్యప్రదేశ్‌లో 5.60 కోట్ల మంది ఓటర్లు
మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 5.60 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 2.88 కోట్ల మంది పురుషులు, 2.72 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 22.36 లక్షల మంది యువ ఓటర్లున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 5 గంటలకు ముగుస్తుంది. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్ సభ స్థానాలున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. ఆ పార్టీ ఇక్కడి అత్యధిక లోక్ సభ సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది.
