- మొత్తం 824 స్థానాల్లో ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ షురూ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 824 అసెంబ్లీ స్థానాల్లో సోమవారం(మే 4న) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటల కల్లా తొలి ట్రెండ్‌లు వెలువడే అవకాశం ఉంది. సాయంత్రంలోగా పూర్తి స్పష్టత రానుంది.
రిటర్నింగ్ అధికారులు అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక ఫలితాన్ని ధ్రువీకరించి ప్రకటిస్తారు. మొత్తం 824 నియోజకవర్గాల్లో ఏకకాలంలో లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లు రియల్ టైమ్ అప్‌డేట్‌ల కోసం ఈసీఐ వెబ్‌సైట్ ని చూడవచ్చని పేర్కొంది. ఈ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ నెలలో జరిగింది.
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. బెంగాల్‌లో అత్యధికంగా 92 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు కాగా.. అస్సాంలో రికార్డు స్థాయిలో 85.38 శాతం మంది ఓటేశారు.
తమిళనాడులో 84.69 శాతం, కేరళలో 79.63 శాతం, పుదుచ్చేరిలో 89.87 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగ్ ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
రాజకీయ వర్గాల్లో సర్వేల ప్రకంపనలు
ఎగ్జిట్ పోల్ అంచనాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోందని, అక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదని సర్వేలు హెచ్చరిస్తున్నాయి.
