ఓయూ, వెలుగు: ఈ నెల 19, 20 తేదీల్లో ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(ఏఐయూ) ఆధ్వర్యంలో ‘వైస్ చాన్స్‌లర్స్ మీట్ 2025–26’ జరుగనుంది. సదస్సు వివరాలను ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ సోమవారం గెస్ట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సదస్సుకు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అంతేగాకుండా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది వైస్ చాన్స్లర్లు, విద్యావేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ‘ఏఐ, క్వాంటం సాంకేతికతతో ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన’ అంశంపై విస్తృత చర్చ జరగనుంది.
మూడు సెషన్లలో ‘ఏఐ ఆధారిత విద్యలో నైతికత, పారదర్శకత’, ‘పాలనా సంస్కరణలు, స్వయం ప్రతిపత్తి’, ‘సమష్టి నాయకత్వం, వనరుల భాగస్వామ్యం’పై చర్చించనున్నారు. చీఫ్ ప్యాట్రన్‌గా ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, ప్యాట్రన్లుగా వినయ్ కుమార్ పాఠక్, పంకజ మిత్తల్ వ్యవహరిస్తారని తెలిపారు.
