గంగాజలాన్ని చిలకరిస్తూ.. డెడ్ బాడీని 18 నెలలు ఉంచుకున్నారు

గంగాజలాన్ని చిలకరిస్తూ.. డెడ్ బాడీని 18 నెలలు ఉంచుకున్నారు

కోమాలో ఉన్నాడనుకొని ఉత్తరప్రదేశ్ లోని ఓ కుటుంబం దాదాపు 18నెలలు శవాన్ని తమ ఇంట్లోనే ఉంచుకుంది. చనిపోయాడని అధికారులు ధ్రువీకరించినా.. అంత్యక్రియలు నిర్వహించకుండా ఏడాదిన్నర పాటు ఇంట్లోనే పెట్టుకున్నారు. వినడానికే గగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది.

2021 ఏప్రిల్ 22లోనే..

రావత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణపురి రోషన్ నగర్‌లో నివసిస్తూ, ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న విమలేశ్ దీక్షిత్ గతేడాది ఏప్రిల్‌లో మరణించారు. అయితే 2021 ఏప్రిల్ 22లో కార్డియాక్ రెస్పిరేటరీ సిండ్రోమ్ తో చనిపోయాడని ఓ ప్రైవేటు ఆసుపత్రి మరణ ధృవీకరణ పత్రం కూడా జారీ చేసింది. కానీ అతని కుటుంబసభ్యులు మాత్రం విమలేశ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని భావిస్తూ.. అంత్యక్రియలు నిర్వహించడానికి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయాన్ని స్థానికులు, బంధువుల వద్ద దాచిపెట్టి శవాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు.

మృతదేహంపై గంగాజలాన్ని చిలకరిస్తూ..

నిర్జీవంగా పడి ఉన్న విమలేశ్ మృతదేహంపై అతని భార్య రోజూ గంగాజలాన్ని చిలకరిస్తూ.. ఇది కోమా నుంచి బయటపడడానికి సాయం చేస్తుందని చెప్పేదట. అయితే విమలేశ్ చనిపోయినా అతని పెన్షన్ ఫైల్ అలాగే ఉండిపోయిందని, ఎలాంటి అప్ డేటూ లేదని భావించిన ఆదాయపు పన్ను అధికారులు ఇటీవల చీఫ్ మెడికల్ ఆఫీసర్ అలోక్ రంజన్ ను ఆశ్రయించారు. విచారణ చేయాల్సిందిగా కోరారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కోమాలో ఉన్నాడని పట్టుబట్టారు..

పోలీసులు, మేజిస్ట్రేట్‌తో పాటు ఆరోగ్య అధికారుల బృందం విమలేశ్ ఇంటికి చేరుకొని అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలోనూ అతని కుటుంబ సభ్యులు విమలేశ్ సజీవంగా ఉన్నాడని, కోమాలో ఉన్నాడని పట్టుబట్టారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం విమలేశ్ బాడీని లాలా లజ్‌పత్ రాయ్  ఆసుపత్రికి తీసుకెళ్లి, అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని, దానికి సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా సమర్పించాలని సీఎంఓ కోరింది. ఈ క్రమంలో మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.