V6 News

ఏపీలో పవన్ కళ్యాణ్ లాగా.. తమిళనాట విజయ్ కీలకం కానున్నారా? టీవీకే గెలుపుపై ప్రముఖ జ్యోతిష్యుడి షాకింగ్ జోస్యం!

ఏపీలో పవన్ కళ్యాణ్ లాగా.. తమిళనాట విజయ్ కీలకం కానున్నారా? టీవీకే గెలుపుపై ప్రముఖ జ్యోతిష్యుడి షాకింగ్ జోస్యం!

దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకటే పేరు మార్మోగుతోంది. అదే దళపతి విజయ్. సినిమాలకు గుడ్ బై చెప్పి 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. ఏప్రిల్ 23న జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే ఏ మేరకు ప్రభావం చూపుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పోటా పోటీనా అధికార, విపక్షాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మే 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల కంటే ముందే ఒక ప్రముఖ జ్యోతిష్యుడి జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 

'నీచభంగ రాజయోగం' లో విజయ్..

విజయ్ ప్రస్తుతం తన జీవితంలో అత్యంత 'కీలక దశ'లోకి ప్రవేశించారని అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రముఖ జ్యోతిష్యుడు షెల్వీ కె దామోదరన్ చెప్పుకొచ్చారు. విజయ్ జాతకంలో 'నీచభంగ రాజయోగం' ఉందని, ఇది ఒక వ్యక్తికి అపారమైన కీర్తిని, అధికారాన్ని, ప్రభావాన్ని కట్టబెడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ గ్రహ స్థితి కారణంగానే విజయ్ రాజకీయ అరంగేట్రం తమిళనాడు ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఆయన విశ్లేషించారు.

ఎంజీఆర్, జయలలితలతో పోలిక

విజయ్‌కు ఉన్న ప్రజాదరణ కేవలం వెండితెరకే పరిమితం కాదని, ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నాయకుల స్థాయిలోనే ఆయనకు ఓటు బ్యాంకు ఉందని షెల్వీ అంచనా వేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోయినా, విజయ్ నేరుగా ఎన్నికల బరిలోకి దిగడం పెద్ద మలుపు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక పవనాలు విజయ్‌కు కలిసి వస్తాయని, ఆయన టాప్ రేసులో నిలుస్తారని జోస్యం చెప్పారు. అయితే ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాగా.. తమిళనాట విజయ్ కీలకంగా మారనున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరణాలపై ముందే హెచ్చరిక..

అయితే, ఈ జోస్యంలో ఒక ఆసక్తికరమైన, ఆందోళనకరమైన అంశం కూడా ఉంది . ఎన్నికల ప్రచార సమయంలో భారీ రోడ్ షోలు నిర్వహించవద్దని ఆయన విజయ్‌ను హెచ్చరించారు. అదుపుచేయలేని జనం, ఉత్సాహవంతులైన అభిమానుల వల్ల తొక్కిసలాటలు జరిగి  మరణాలు సంభవించే ప్రమాదం ఉందని షెల్వీ ముందే హెచ్చరించారు. అందుకే బహిరంగ రోడ్ షోల కంటే, పక్కా ప్రణాళికతో కూడిన సభలే శ్రేయస్కరమని ఆయన గతంలోనే సూచించారు.

మే 4న అసలు సిసలు పరీక్ష

విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎదుర్కొంటున్న మొదటి పరీక్ష ఇదే. జ్యోతిష్యుల మాటలు ఎలా ఉన్నా, రాజకీయ విశ్లేషకులు మాత్రం పొత్తుల లెక్కలు, ఓటర్ల మూడ్ ఆధారంగానే గెలుపోటములు ఉంటాయని చెబుతున్నారు. ఒకవైపు డీఎంకే-ఏఐఏడీఎంకే వంటి బలమైన శక్తులు, మరోవైపు అగ్ర నటుడు విజయ్.. ఈ పోరులో తమిళ ఓటరు ఎవరి వైపు నిలిచాడు? విజయ్ జాతకంలోని 'రాజయోగం' ఆయనను సింహాసనంపై కూర్చోబెడుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ మే 4న సమాధానం దొరుకుతుంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో నటులు ముఖ్యమంత్రులుగా మారిన చరిత్ర ఉంది. మరి విజయ్ ఆ చరిత్రను పునరావృతం చేస్తారో లేదో చూడాలి...