
హైదరాబాద్ ,వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు బీఆర్ ఎస్ ను బొంద పెడతారని జేఏసీ చైర్మన్, టీఎంయూ ఫౌండర్, గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కార్మికులు ఇబ్బందుల పాలవ్వడానికి ఆయనే కారణమని ఆరోపించారు. రాష్ర్టంలోని 43 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు అందరూ కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కోరారు. బీఆర్ ఎస్, బీజేపీ లు ఆర్టీసీ కార్మికుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చలేదన్నారు.
కాంగ్రెస్ అన్ని సమస్యలను ప్రస్తావించిందన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీఎంయూ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీలు, డీఏ, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లించలేదని చెప్పారు. 3 ఏళ్ల కింద సమ్మె చేసినందుకు ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేశారని మండిపడ్డారు.
ఆస్తులను దోచుకోవటం కోసమే విలీనం
ఎన్నికలు రావడంతోనే ఆర్టీసీ విలీనం ప్రభుత్వానికి గుర్తుకు వచ్చిందని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఆస్తులను కాజేయడమే లక్ష్యంగా ఎన్నికల ముందు విలీనం అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారని చెప్పారు. కార్మికుల సమస్యలను ప్రస్తావించకుండా బిల్ డ్రాఫ్ట్ రెడీ చేయడంతో అందుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాక కూడా అధికారుల కమిటీ కాలయాపన చేసిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు ప్రాసెస్ ను ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ఆమోదం తర్వాత సీఎంవోలో 22 రోజుల పాటు బిల్లును ఆపారని ఆరోపించారు.
జైరాం రమేష్ ను కలిసి మద్దతు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ను అశ్వత్థామరెడ్డి కలిసి ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనను జైరాం రమేష్ అభినందించారు.
కాంగ్రెస్ గెలుపునకు పని చేయాలని కోరారు.